కాల్‌’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! 

17 Nov, 2022 09:53 IST|Sakshi

సైదాబాద్‌: తన భార్య దూరమైందనే బాధ... ఆమెను తన వద్దకు చేర్చట్లేదని పోలీసులపై కోపం...ఈ పరిస్థితులే ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్‌ చేసేలా చేశాయి. అతగాడు మంగళవారం రాత్రి చేసిన ఆ కాల్‌ పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ను ఉరుకులు, పరుగులు పెట్టింది. బుధవారం అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 18 రోజుల జైలు శిక్ష విధించింది. సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బిరామిరెడి కథనం ప్రకారం... సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఎండీ అక్బర్‌ఖాన్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు.

వివాహమైనప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబం«ధించి  అతడి గతంలో పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు.  అయితే అక్బర్‌ ప్రవర్తనతో విసిగిపోయానని, తాను అతడితో కలిసి ఉండలేనంటూ ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఓపక్క తన భార్య దూరమైందనే బాధ, మరోపక్క పోలీసులు ఆమెను తీసుకువచ్చి తనకు అప్పగించట్లేదనే ఆవేదన అతడిలో ఎక్కువ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో అతగాడు తన ఫోన్‌ నుంచే నేరుగా సైదాబాద్‌ ఠాణాకు ఫోన్‌ కాల్‌ చేశాడు.

ఐఎస్‌సదన్‌లోని మసీద్‌ మందిర్‌ చౌరస్తాలో కొందరు  బాంబు పెట్టనున్నారంటూ చెప్పాడు. ఈ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌లను పిలిపించారు. ఐఎస్‌ సదన్‌ ప్రాంతంలో అణువణువూ గాలించారు. చివరు అది బెదిరింపు కాల్‌గా తేల్చారు. ఈ ఉదంతంపై సైదాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది.

ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు బుధవారం ఉదయం అక్బన్‌ ఖాన్‌ను పట్టుకున్నారు. ఈ నిందితుడిపై ఐపీసీలోని 182, 186తో పాటు సిటీ పోలీసు యాక్ట్‌లోని 70 (బీ) సెక్షన్‌ కింద ఆరోపణలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం అక్బర్‌ ఖాన్‌కు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సైదాబాద్‌ పోలీసులు అతనినిన చంచల్‌గూడ జైలుకు తరలించారు.   

(చదవండి: చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..)

మరిన్ని వార్తలు