తండ్రి, కుమారుడి ప్రాణం తీసిన స్థల వివాదం

9 Aug, 2021 11:37 IST|Sakshi

బొమ్మలసత్రం: స్థల వివాదం తండ్రి, కుమారుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు..నంద్యాలలో కోటా వీధికి చెందిన చిన్న సుబ్బరాయుడు, వెంకట లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు నాగరమేష్, కుమార్తె సుదీపిక ఉన్నారు. చిన్న సుబ్బరాయుడుతో పాటు సమీప బంధువు కందాల కృష్ణమూర్తికి పూర్వీకుల నుంచి భూములు వచ్చాయి. నంద్యాల మండలం పులిమద్ది గ్రామ సమీపంలోని సర్వే నంబర్‌ 246లో రెండు ఎకరాలు, కొత్తపల్లి గ్రామ సమీపంలోని సర్వే 1578లో 55 సెంట్ల భూమిని వీరిద్దరూ కౌలుకు ఇచ్చేవారు. వచ్చిన ధాన్యాన్ని రెండు భాగాలుగా పంచుకునే వారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గౌరీశంకర్, విజయ్‌కుమార్‌ న్యాయవాదులు కావటంతో నాలుగేళ్ల క్రితం రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ఆన్‌లైన్‌లో భూములను తమ పేర్లపై మార్చుకున్నారు.

ఈ విషయం తెలిసి గౌండా పని చేస్తున్న చిన్న సుబ్బరాయుడు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో డిగ్రీ వరకు చదువుకున్న సుబ్బరాయుడు కుమారుడు నాగరమేష్‌ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం నంద్యాల శివారు ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన చిన్న సుబ్బరాయుడు శనివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న బంధువులు చిన్న సుబ్బరాయుడి మృత దేహంతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కందాల కృష్ణమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు