Hyderbad: సికిం‍ద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం

16 Jan, 2022 08:13 IST|Sakshi

Fire Accident In Secunderabad Club: కంటోన్మెంట్‌: నగరంలోని పురాతన సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్‌ విభాగం, బార్, లైబ్రరీలు పూ ర్తిగా మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అవి అదుపులోకి రాలేదు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రూ.20 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

పురాతన వైరింగే కారణమా? 
► 20.17 ఎకరాల స్థలంలో వెలసిన సికింద్రాబాద్‌ క్లబ్‌లో వివిధ క్రీడా ప్రాంగణాలతో పాటు సువిశాలమైన ప్రధాన భవనం ఉంది. ఇందులోనే మూడు బార్‌లు, డైనింగ్‌ హాల్స్, ఇండోర్‌ గేమ్స్‌ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాలు ఉన్నాయి. ఈ భవనాన్ని ఆనుకునే కాన్షరెన్స్, మీటింగ్‌ హాళ్లు, పెట్రోల్‌ బంకు, బ్యాంకు భవనాలు ఉన్నాయి.

►సుమారు వందేళ్ల నాటి ప్రధాన భవనం బ్రిటిష్‌ శైలిలో నిర్మితమైంది. కేవలం ఇనుప స్తంభాలపై చెక్కలతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. భవనంలోని పురాతన వైరింగ్‌ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని యాజమాన్యం సైతం భావిస్తోంది. చెక్కలతో కూడిన నిర్మాణంతో పాటు బార్‌లోని మద్యం కూడా అగ్ని కీలలు ఎగిసి పడటానికి కారణమైనట్లు భావిస్తున్నారు. 

మీడియాకు నో ఎంట్రీ 
అగ్ని ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే వివిధ మీడియా చానెళ్లు, పత్రికల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో క్లబ్‌కు చేరుకున్నారు. అప్పటికే క్లబ్‌ మూడు ద్వారాలనూ మూసేశారు. పోలీసు బందోబస్తుతో లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఎట్టకేలకు క్లబ్‌ అధ్యక్షుడు రఘురామి రెడ్డి బయటకు వచ్చి ప్రమాద వివరాలను వెల్లడించారు. ప్రమాద ఘటనకు కారణాలు, నష్టంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేమన్నారు. ఇంజినీరింగ్‌ విభాగం నివేదిక ఇచ్చాకే నష్టంపై స్పష్టత వస్తుందన్నారు.  

పరిశీలించిన ఎమ్మెల్యే, పీసీబీ, సీఈఓ.. 
సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సాయన్న క్లబ్‌ను సందర్శించారు. యాజమాన్యంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ స్టేషన్‌ కమాండర్‌ బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర, కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓ బి.అజిత్‌ రెడ్డిలు క్లబ్‌ను సందర్శించి ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని పరిశీలించారు.

స్పందించిన మంత్రి కేటీఆర్‌ 
సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం స్పందించారు. ఈ ప్రమాదం దురదృష్టకరం అంటూనే, క్లబ్‌ యాజమాన్యం ఫైర్‌ జాగ్రత్తలు పాటించారా? సంబంధిత అధికారుల నుంచి ఫైర్‌ ఎన్‌ఓసీ తీసుకున్నారా? అంటూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

ఫైర్‌ ఎన్‌ఓసీ లేదు! 
సికింద్రాబాద్‌ క్లబ్‌ కంటోన్మెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి ఫైర్‌ ఎన్‌ఓసీలు ఇవ్వడం కుదరదు. కంటోన్మెంట్‌లో ఫైర్‌ విభాగమే లేదు. ఇక నేరుగా అగ్నిమాపక శాఖ డీజీ పరిధిలోనే ఎన్‌ఓసీలు జారీ చేయాల్సి ఉంటుంది.  సికింద్రాబాద్‌ క్లబ్‌ యాజమాన్యం ఎలాంటి ఫైర్‌ ఎన్‌ఓసీ తీసుకోలేదని తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు