ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్‌ ట్విస్ట్‌

19 Dec, 2022 09:27 IST|Sakshi

కాజీపేట(హన్మకొండ జిల్లా): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిచడాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య రూ.4లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సౌత్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ తెలిపారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కాజీపేట డీజిల్‌ కాలనీలో నివాసం ఉండే జిన్నారపు వేణుకుమార్‌ (34) గిరిగిరి చిట్టిల వ్యాపారం చేసేవాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య సుశ్మిత రైల్వేలో ఉద్యోగం చేస్తుంది.

భార్యలిద్దరినీ ఒకే ఇంటిలో ఉంచి కాపురం చేస్తున్న వేణుకుమార్‌ మహబూబాబాద్‌కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య సుశ్మిత తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్‌ అనే రౌడీషీటర్‌కు రూ.4లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది.

ఈ క్రమంలో రత్నాకర్‌ వరంగల్‌ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ కొంగర అనిల్, ఇస్సీపేటకు చెందిన కటిక అనిల్‌కు సుపారీ విషయం చెప్పి వేణుకుమార్‌ను హత్య చేసేందుకు ఒప్పించాడు. పథకం ప్రకారం సెప్టెంబర్‌ 30న సుశ్మిత తన భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్‌ను గొంతు నులిమి హత్య చేసి పడేసి హనుమకొండకు వచ్చారు.

అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్‌ 2న భర్త వేణుకుమార్‌ కనిపించడం లేదంటూ సుశ్మిత కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంథని పోలీసులు వాగులో కనిపించిన మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా ప్రకటించారు. అయితే, సుశ్మిత ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తూ ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి విషయాన్ని ఏసీపీ శ్రీనివాస్, డీసీపీలకు వివరించి కాల్‌ లిస్ట్‌ బయటకు తీశారు.

ఆమె నిత్యం నిందితులతో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. దీంతో ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసి సుశ్మితను అదుపులోకి తీసుకుని విచారించగా వేణుకుమార్‌ను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా ఒప్పుకుంది. మంథని పోలీసుల సమకారంతో మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేయించిన పోలీసులు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులతో పాటు కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్‌కుమార్, రవికుమార్, సిబ్బందిని వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ అభినందించారు.  
చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు