విషాదం: శుభకార్యానికి వెళ్తుండగా..

15 Mar, 2021 10:24 IST|Sakshi
క్షతగాత్రుడిని ఆటో నుంచి బయటకు తీస్తున్న స్థానికులు

ఆటోను ఢీకొన్న కంటెయినర్‌..

నలుగురి దుర్మరణం..

మరో నలుగురికి తీవ్ర గాయాలు

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

సాక్షి, జోగిపేట (అందోల్‌): శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లిన కుటుంబాన్ని.. అరగంటలో గమ్యస్థానం చేరుకుంటుందనగా మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం అల్మాయిపేట శివారులో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన ఎల్లదాస్‌ కుటుంబీకులు చాలా ఏళ్లుగా సంగారెడ్డిలో స్థిరపడ్డారు. ఆదివారం మన్‌సాన్‌పల్లిలోని బంధువుల ఇంట్లో డోలారోహణం కార్యక్రమం ఉంది. ఈ వేడుకకు ఎల్లదాసు సోదరుడైన శ్రవణ్‌కుమార్‌ (40) అతని భార్య స్వప్న, పిల్లలు సాయిచరణ్‌ (7), సాయి విఘ్నేశ్‌ (11)తో పాటు వరుసకు బావ అయిన వెంకటేశం (39) అతని భార్య పద్మ, ఇతర కుటుంబ సభ్యులు భవాని, రమేశ్‌తో కలిసి ఆటోలో అందోల్‌ మండలం మన్‌సాన్‌పల్లి గ్రామానికి బయల్దేరారు.

అల్మాయిపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్‌ ఆటోని ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో శ్రవణ్‌కుమార్, సాయిచరణ్, సాయి విఘ్నేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశం మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ భవాని, స్వప్న, రమేశ్, పద్మలను మెరుగైన చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జోగిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు