'యువగళం మనకోసం' వాట్సాప్‌ గ్రూపులో ఘరానా మోసం 

6 Feb, 2023 04:31 IST|Sakshi
ఫోన్‌ పే ద్వారా రూ.30 వేలు తీసుకున్న టీడీపీ నేత మనోహర్‌ చౌదరి

లోను ఇస్తానంటూ అడ్మిన్‌ మనోహర్‌ చౌదరి మెసేజ్‌ 

లోన్‌ కావాలన్న ఓ వ్యక్తికి పంగనామాలు 

రూ.1.43 లక్షలను కాజేసిన తమ్ముడు 

దర్యాప్తు చేస్తున్న తిరుపతి జిల్లా పోలీసులు  

చంద్రగిరి (తిరుపతి జిల్లా): యువగళం పేరుతో ఓ వైపు నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తుంటే.. ఆయన అనుచరులు అదే పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి మోసాలకు తెగబడుతున్నారు. అలాంటి గ్రూప్‌లో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి యువగళం మనకోసం వాట్సాప్‌ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు.

గ్రూప్‌ సభ్యులకు రూ. 2 లక్షల వరకూ లోన్‌ ఇస్తానంటూ గత నెల 29న కాకినాడకు చెందిన అడ్మిన్‌ మనోహర్‌ చౌదరి గ్రూపులో మెసేజ్‌ పెట్టాడు. దీంతో బాధితుడు తనకు లోను కావాలంటూ మెసేజ్‌ చేశాడు. 30వ తేదీన మనోహర్‌ చౌదరి బాధితుడికి ఫోన్‌ చేసి లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 3,800 చెల్లించాలని కోరడంతో బాధితుడు గూగుల్‌ పే ద్వారా చెల్లించాడు.

తనకు రూ. 15 వేలు పంపిస్తే లోను మంజూరు చేస్తానని మనోహర్‌ చౌదరి మరోసారి చెప్పగా బాధితుడు మళ్లీ గూగుల్‌ పే ద్వారా చెల్లించాడు. ఇలా మాయమాటలు చెప్పి బాధితుడి వద్ద నుంచి మనోహర్‌ చౌదరి మొత్తం రూ. 1.43 లక్షలు కాజేశాడు. ఇంత చెల్లించినా ఇంకో రూ. 15 వేలు పంపమని చెప్పడంతో బాధితుడు ఎదురుతిరగగా.. మనోహర్‌ చౌదరి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు.

తక్షణమే స్పందించిన పోలీసులు మనోహర్‌ చౌదరికి చెందిన 2 బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేశారు. మోసగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, తనకు వచ్చిన లింక్‌ ద్వారా యువగళం మనకోసం గ్రూపులో సభ్యుడిగా చేరానని బాధితుడు తెలిపాడు. గ్రూపు అడ్మిన్‌ మనోహర్‌ చౌదరి తనను మోసం చేయడమే కాకుండా.. తననే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని వాపోయాడు.   

మరిన్ని వార్తలు