ఒక్కగానొక్క బిడ్డ.. విధి ఆడిన ఆటలో..

18 Dec, 2022 21:02 IST|Sakshi
లావణ్య (ఫైల్‌)

శాంతిపురం(చిత్తూరు జిల్లా): విధి ఆడిన ఆటలో ఆ కుటుంబం ఇంట తీరని విషాదం మిగిలింది. రోడ్డు ప్రమాద రూపంలో ఉన్న ఒక్కగానొక్క బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదన అంతాఇంతా కాదు. వివరాలు.. కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో ఏపీ మోడల్‌ స్కూల్‌ ఎదుట కారు ఢీకొనడంతో గాయపడి న 6వ తరగతి విద్యార్థిని లావణ్య(11) చికిత్స పొందు తూ మృతి చెందింది.

కడపల్లి పంచాయతీలోని కదిరి ఓబనపల్లికి చెందిన వెంకట్రామప్ప, కాంతమ్మ ఏకైక సంతానం లావణ్య. గొర్రెలు మేపుతూ జీవనం సాగి స్తున్న దంపతులకు చాలాకాలం తర్వాత లావణ్య పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. చదువుల్లో చురుకుగా ఉండే లావణ్య స్థానిక ఏపీ మోడల్‌ స్కూల్లో సీటు సాధించింది. శుక్రవారం సాయంత్రం స్కూల్‌ ముగిశాక రోడ్డు దాటే క్రమంలో  కారు ఢీకొంది.

తీవ్రంగా గాయపడిన లావణ్యను వెంటనే కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో బాలికకు వెంటిలేటర్‌ సాయంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడిన లావణ్య శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్న ఒక్క బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విద్యార్థిని మృతితో శనివారం స్కూల్‌కు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, టీచర్లు కదిరిఓబనపల్లిలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
చదవండి: ‘అమ్మా నన్ను క్షమించండి.. వెళ్లాలని లేకున్నా వెళ్తున్నా’ 

మరిన్ని వార్తలు