గుట్కా డాన్‌ కామేశ్వరరావు అరెస్టు 

1 Sep, 2020 10:40 IST|Sakshi
బలిశెట్టి కామేశ్వరరావు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు (ఫైల్‌) 

సాక్షి, గుంటూరు: పాన్‌ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను ఇటీవల గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే గుట్కా వ్యాపారి కామేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక ధ్రువపత్రాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామేశ్వరరావు, ఆయన అనుచరుల కాల్‌ డేటా ఆధారంగా,  వీరితో ఎవరెవరికి సంబంధాలున్నాయనే దానే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గుంటూరు కేంద్రంగా గత కొద్ది రోజులుగా భారీస్థాయిలో నిషేధిత గుట్కాల వ్యాపారం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్‌లోని పలు ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాల్ని తీసుకువచ్చి ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుండటంతో పాటు, ఈ గోడౌన్లలో సైతం నిసేధిత గుట్కాలు తయారీ చేశారు. తమ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.   

చూసీచూడనట్టు వదిలేశారా? 
తమ పరిధిలో గుట్కా దందా కొనసాగుతున్పటికీ మామూళ్ల మత్తులో కొందరు సీఐలు, డీఎస్పీలు చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న దర్యాప్తులో ఈ మామూళ్ల వ్యవహారం బయటపడేనా అనే చర్చ పోలీస్‌ శాఖలో నడుస్తోంది. గుట్కా కామేశ్వరరావు, ఆయన అనుచరుల అరెస్టుతో ఇప్పటికే కొందరు పోలీస్‌ సిబ్బంది, అధికారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగలకు మల్లే మారింది. పోలీస్‌ సిబ్బంది, అధికారులు గుట్కా దందా నడుస్తున్న వ్యవహారం తెలిసీ చూసి చూడనట్టు వదిలేశారా? నెలవారీ మామూళ్లు వసూళ్లు చేశారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగించి అసాంఘిక కార్యకలాపాలకు సహరించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటే పోలీస్‌ శాఖలో సైతం ప్రక్షాళన చేసినట్టవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

ప్రమేయం ఉంటే చర్యలు  
నిషేధిత గుట్కాల తయారీ, సరఫరా కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతున్నాం. దర్యాప్తులో పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. కామేశ్వరరావుపై పీడీ యాక్డు విధించడానికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా కలెక్టర్‌కు పంపాం. ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు ముప్పు కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. పీడీ యాక్డు ప్రయోగించడంతో పాటు, జిల్లా బహిష్కరణ వంటి చర్యలకు వెనుకాడం. – ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి, అర్బన్‌ జిల్లా ఎస్పీ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా