గో కార్ట్‌ నిర్మాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు

21 Nov, 2020 11:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ అధికారులు మంగమారి పేట వద్ద స్వాధీనం చేసుకున్న గో కార్ట్ ప్రదేశం అక్రమాలకు.. ఆక్రమణలకు కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో ఉన్న గో కార్ట్ చిన్నారులు నుంచి యువత వరకు కార్.. గో కార్ట్ పోటీలు నిర్వహిస్తుంటారు.  పదినిమిషాల రేస్‌కు 300 నుంచి వసూలు చేసేవారు. ఈ దశలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిజానికి వుడా పరిధిలో ఉన్న గో కార్ట్‌ గ్రూప్ నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఏళ్ళతరబడి కార్ట్ పోటీలు నిర్వహించడమే కాక అక్కడ రెస్టారెంట్  కూడా కొనసాగిస్తున్నారు. 

సర్వేనెంబర్ 299, 301 పరిధిలోని దాదాపు నాలుగు ఎకరాల 48 సెంట్ల భూమిలో అక్రమ వ్యవహారం కొనసాగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ దశలో జీవీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. గేమ్ ఆడేందుకు వచ్చిన పర్యాటకుల కోసం అనధికారికంగా కొనసాగిస్తున్న టీ రెస్టారెంట్‌ను కూడా తొలగించారు. ఇదే రీతిన అనధికారిక నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌​డీసీపీ అధికారి వెల్లడించారు.   (ఆయన దారి.. జాతీయ రహదారి)

కాగా.. గో కార్ట్ నిర్వాహకుడు కాశీవిశ్వనాథ్ వ్యవహారాలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పలు అనధికారిక వ్యవహారాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగా గో కార్ట్‌తో పాటు రుషికొండ వద్ద టూరిజం ప్రదేశంలో రేవ్ పార్టీ నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు రుషికొండ వద్ద జరిగిన ఓ పార్టీలో మద్యం సేవించిన వ్యవహారంపై 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గో కార్ట్ నిర్వాహకులు కాశీ విశ్వనాథ్ తనయుడు కూడా ఉన్నాడు. ఆ పార్టీ సమయంలో డ్రగ్స్ కూడా వినియోగించిన వ్యవహారంపై ఆరీలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా గో కార్ట్ ప్రదేశంలో కూడా బెట్టింగ్‌లు జరిగినట్టు చాలా వరకూ ఆరోపణలున్నాయి ఈ దశలో ఈ నిర్మాణం తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు