భార్యను కాళ్లతో తన్ని .. ఆపై గొంతు నులిమి..  

29 Jul, 2021 09:38 IST|Sakshi

సాక్షి, పెద్దఅడిశర్లపల్లి(నల్లగొండ): కలకాలం తోడూ నీడగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతానని ప్రమాణం చేసిన భర్తే ఆ ఇల్లాలి పాలిట కాలయముయ్యాడు. మూడు ముళ్ల బంధానికి తూట్లు పొడిచి మృగాడిగా మారాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో చివరకు నమ్మి వచ్చిన అభాగ్యురాలిని దారుణంగా కాళ్లతో తన్ని.. ఆపై గొంతునులిమి కడతేర్చాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌ రోడ్‌ వద్ద  బుధవారం చోటు చేసుకుంది.

స్థానికులు, గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు  తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అంగడిపేట తండాకు చెందిన రమావత్‌ రెడ్యా–బుజ్జి దంపతుల కుమార్తె సుజాత(33)కు పెద్దఅడిశర్లపల్లి మండలం మునావత్‌ తండాకు చెందిన మునావత్‌ శ్రీనుతో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం.

పెళ్లైన కొంతకాలానికే..
వివాహమైన కొంత కాలానికే శ్రీను భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఏ పని చేయకుండా నిత్యం తాగుతూ ఘర్షణ పడేవాడు. కూతురు పడుతున్న బాధలు చూడలేక సుజాత తల్లిదండ్రులు అంగడిపేట తండాలో ఇల్లు ఇవ్వడంతో అక్కడే ఉంటున్నారు. అంగడిపేట ఎక్స్‌ రోడ్‌ వద్ద రొట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంటినుంచి బయటికి పరుగు తీసినా..
ఎప్పటిలాగే శ్రీను బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్యం తాగాలనే కాంక్షతో భార్యను డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గొడవకు దిగాడు. ఆపై ఆమెను ఇష్టారీతిలో కొడుతూ కాళ్లతో తన్నడంతో భయాందోళనతో ఇంటినుంచి బయటికి పరుగు తీసింది. అయినప్పటికీ శ్రీను ఆమె వెంట పడి చివరకు గొంతు నులుమడంతో స్పృహతప్పింది.

వెంటనే శ్రీను అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన ఇరుగు పొరుగువారు సుజాతను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరి శీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు జాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు