-

కడతేర్చి.. కట్టుకథ చెప్పాడు.. చివర్లో బండారం ఇలా బయటపడింది

28 Oct, 2021 12:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భార్య గొంతు నులిమి హత్య చేసిన భర్త

సాధారణ మృతేనని అందరినీ నమ్మించిన వైనం

కుమారుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి..

వీరఘట్టం మండలంలో ఘటన

సాక్షి,వీరఘట్టం( శ్రీకాకుళం): ఒక రాత్రంతా శవ జాగరణ చేశారు. ఎవరికీ అనుమానం రాలేదు. మృతదేహం పక్కన భజన కూడా ఏర్పాటు చేశారు. అయినా ఎవరి దృష్టి అతడిపై పడలేదు. తన భార్య మూర్ఛ వచ్చి చనిపోయిందని చెబితే అంతా నమ్మేశారు. అయ్యో పాపం అనుకున్నారు. కానీ తెల్లవారాక అసలు నిజం వెలుగు చూసింది. అప్పటి వరకు అతడి నటన చూసి వారికి దిమ్మ దిరిగిపోయింది. భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త.. ఆమెది సాధారణ మరణమేనని దాదాపు అందరినీ నమ్మించేశాడు. శవ యాత్ర పూర్తయితే నిజం కూడా బయటకు వచ్చేది కాదు.

కుమారులకు వచ్చిన అనుమానం హంతకుడిని పట్టించింది. వీరఘట్టం మండలం కంబరవలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామానికి చెందిన బేతాల గౌరు తన భార్య పైడమ్మ(51)ను మంగళవారం రాత్రి పాశవికంగా హత్య చేశాడు. పాతికేళ్ల కిందట వీరిద్దరికీ వివాహమైంది. అప్పటికే పైడమ్మకు వివాహం జరిగి ఇద్దరు కుమారులు ఉన్నారు. ( చదవండి: Cyber Defamation: సోషల్ మీడియాలో మీపై అసభ్య పోస్టులు వస్తున్నాయా?.. ఆన్‌లైన్‌ పరువు నష్టం ఇలా వేయండి.. )

గౌరుకు కూడా అది రెండో వివాహమే. అయితే వీరి దాంపత్యం ఎప్పుడూ సజావుగా సాగలేదు. గౌరు తాగుడు, చెడు వ్యసనాల బారిన పడి భార్యతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆయనను భార్య పైడమ్మ నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత పైడమ్మ నిద్రిస్తుండగా గౌరు ఆమె గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె మూర్ఛ వచ్చి చనిపోయిందని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. 

కుమారుల అనుమానంతో..  
రాత్రంతా శవ జాగరణ అయ్యాక ఉదయం మృతురాలి కుమారులు మురళీ, రామప్పుడులు తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. గౌరు ప్రవర్తనపై వారికి అవగాహన ఉండడం, మృతదేహం చెవి నుంచి రక్తం కారినట్టు, గొంతు నులిమినట్టు ఆనవాలు ఉండడంతో 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో పాలకొండ డీఎస్పీ శ్రావణి, సీఐ శంకరరావు, ఎస్‌ఐ జి.భాస్కరరావులు రంగంలోకి దిగారు.

ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో పాటు గౌరును కూడా విచారించారు. తన పనులకు అడ్డుగా ఉంటోందని పైడమ్మను తానే హత్య చేసినట్లు గౌరు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. వెంటనే సీఐ జి.శంకరరావు కేసు నమోదు చేసి గ్రామపెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో శవ పంచనామా చేసి పోస్టుమార్టంకు పంపించారు.

చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య 

   

మరిన్ని వార్తలు