Hyderabad: న్యూఇయర్‌ టార్గెట్‌.. గ్రాము ‘కొకైన్‌’ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

24 Dec, 2021 08:07 IST|Sakshi
కొకైన్‌తో పట్టుబడిన ముగ్గురు నిందితులు   

గ్రాము కొకైన్‌ ధర.. బంగారం కంటే 3 రెట్లు అధికం..

సాక్షి, హైదరాబాద్‌: బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా తయారైంది కొకైన్‌ . గోవా నుంచి గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున దిగుమతి చేసుకొని... హైదరాబాద్‌లో రూ.14 వేలకు విక్రయిస్తున్న ఓ పెడ్లర్‌తో సహా ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఓటీ డీసీపీ జి.సందీప్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడించారు. 

న్యూ ఇయర్‌ వేడుకల కోసం.. 
♦ బాచుపల్లికి చెందిన రామేశ్వర శ్రవణ్‌ కుమార్‌ (24), కొండాపూర్‌కు చెందిన గోరంట్ల చరణ్‌ తేజ (27) స్నేహితులు. న్యూ ఇయర్‌ వేడుకలను కొకైన్‌ మత్తులో తేలిపోవాలని ప్లాన్‌ వేసుకున్నారు. డ్రగ్‌ పెడ్లర్‌ టోలిచౌకికి చెందిన అరబిక్‌ టీచర్‌ మహ్మద్‌ అష్రఫ్‌ బేగ్‌ (37)ను సంప్రదించారు. చెరో గ్రాము కొకైన్‌ కొనుగోలు చేశారు. 
♦ సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ పి.శివ ప్రసాద్‌ తన బృందంతో రాయదుర్గం పీఎస్‌ పరిధిలోని గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌ ఫ్లాట్‌ నం. బి–1305లో ఇద్దరు వినియోగదారులు శ్రవణ్, చరణ్‌ తేజలను అదుపులోకి తీసుకున్నారు.  
♦ఇద్దరి నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకుని వారిని విచారించగా  టోలిచౌకిలోని మహ్మద్‌ అష్రఫ్‌ బేగ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో అష్రఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
చదవండి: ఆన్‌లైన్‌లో పరిచయం.. వ్యక్తిగత ఫోటోలు పంపు, నీ కష్టాలు తీరుస్తానంటూ....

♦అఫ్రష్‌ నుంచి 181 గ్రాముల కొకైన్‌ పౌడర్, 44 ఎండీ ఎక్స్‌టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను నుంచి 183 గ్రాముల కొకైన్‌ పౌడర్, 44 ఎండీ ఎక్స్‌టసీ మాత్రలు, మూడు సెల్‌ఫోన్లు పట్టబడ్డాయి. వీటి విలువ రూ.26.28 లక్షలు. 
♦అష్రఫ్‌ను పోలీసులు విచారించగా.. ప్రధాన డ్రగ్‌ సరఫరాదారు నైజీరియాకు చెందిన జూడ్‌ అలియాస్‌ క్రిస్‌ దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నైజీరియా దేశం నుంచి గోవాకు వచ్చి అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది.  
♦కొంత కాలంగా గోవా నుంచి డ్రగ్స్‌ను దిగుమతి చేసుకొని హైదరాబాద్‌లో వ్యక్తిగత కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అష్రఫ్‌ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు డ్రగ్‌ సప్లయిర్‌ గోవాలో ఉంటున్న జూడ్‌ పరారీలో ఉన్నాడు. 
చదవండి: బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో..

ఈ ఏడాది 202 కేసులు..  
♦  కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరా ఉంటుందని సమాచారం అందుకున్న సైబరాబాద్‌ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బల్క్‌ సప్లయర్స్, స్థానిక రిటైలర్లు, సరఫరాదారులు, వినియోగదారులపై దాడులు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు.  
♦ ఈ ఏడాది ఇప్పటివరకు 202 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయి. 419 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. 23 మందిపై పీడీ యాక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 1,770.8 కిలోల గంజాయి, 37.2 కిలోల 124 గంజాయి మొక్కలు, 14 గాంజా మాత్రలు, 8.55 లీటర్ల హషీప్‌ ఆయిల్, 150 ఎంజీ 12 లైరికా మాత్రలు, 141 కిలోల ఆల్ప్రాజోలం, 116.29 గ్రాముల ఎండీఎంఏ, 200 గ్రాముల ఓపీఎం, 61 ఎక్స్‌టసీ మాత్రలు, 3 ఎల్‌సీడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. 

రాష్ట్రంలో ఇదే అత్యధికం.. 
ఉమ్మడి రాష్ట్రంలో 63 గ్రాముల కొకైన్‌ హైదరాబాద్‌ పరిధిలో అప్పట్లో పట్టుబడింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక కొకైన్‌ కేసుగా నిలవగా.. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో 183 గ్రాముల కొకైన్‌ కేసు బయటపడటంతో ఇదే అత్యధికమని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ సందీప్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు