స్పైసీ రుచులతో ఆక్వా రెస్టారెంట్లు.. ఇలా వెళ్లి అలా తిని రావొచ్చు

24 Dec, 2021 08:06 IST|Sakshi

చేపలు, రొయ్యలు, పీతలతో స్నాక్స్‌

స్పైసీ రుచులతో ఆక్వా రెస్టారెంట్లు 

కంటైనర్‌ తరహాలో ఏర్పాటు 

‘రెడీ టు కుక్‌’ పేరిట మారినేట్‌ చేసిన మత్స్య ఉత్పత్తులు 

‘లైవ్‌’ రూపంలోనూ లభ్యం 

పైలట్‌ ప్రాజెక్టుగా పులివెందులలో ఆక్వాహబ్‌ 

మరో 100 అవుట్‌లెట్స్, 2 స్పోక్స్‌ 

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం 

చేపలు.. రొయ్యలు.. పీతలు. వీటితో పులుసు.. ఇగురు.. వేపుడే కాదు. బిర్యానీ.. మంచూరియా.. స్నాక్స్‌ కూడా అప్పటికప్పుడు తయారవుతాయి. విభిన్న రుచులతో మత్స్య ప్రియుల జిహ్వ చాపల్యాన్ని ఇట్టే తీర్చేస్తాయి. దేశంలోనే తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులు లైవ్‌ (బతికి ఉన్నవి)గానే కాకుండా ‘రెడీ టు కుక్‌’ రూపంలోనూ లభిస్తాయి. అంతేకాకుండా శుచిగా.. రుచిగా వండి అక్కడికక్కడే వడ్డించే రెస్టారెంట్లు సైతం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
– సాక్షి, అమరావతి

సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, చేప, రొయ్య పచ్చళ్లు కూడా అక్కడే లభిస్తాయి. వీటిలో ఏది కావాలన్నా స్వయంగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేదంటే.. ఇంట్లోనే ఉండి డోర్‌ డెలివరీ ద్వారా పొందవచ్చు. వీటి శాంపిల్స్‌ను ఆక్వా ల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాత ఫిష్‌ ఆంధ్రా హబ్, రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.    


       
నేడు సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం 
ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందేలా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఫిష్‌ ఆంధ్రా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే లభించడమే కాకుండా మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్‌ వనరులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఆక్వా పరిశ్రమకు మంచి రోజులొస్తాయి. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. అక్కడే మరో 100 అవుట్‌లెట్స్, 2 స్పోక్స్‌ కూడా అందుబాటులోకి రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా అవుట్‌ లెట్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. 

సీఎం జగన్‌ ప్రారంభించనున్న పులివెందుల  ఆక్వా హబ్‌  

కంటైనర్‌ తరహా రెస్టారెంట్‌ 
మినీ అవుట్‌ లెట్‌లో బతికిన చేప, రొయ్యలు, రెడీ టు కుక్‌ పేరిట మారినేట్‌ చేసిన (ఊరవేసిన) ఉత్పత్తులు, ఎండు చేపలు, రొయ్యలు, పచ్చళ్ల విక్రయాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడికక్కడే తయారు చేసిన స్నాక్‌ ఐటమ్స్‌ పార్శిల్స్‌ రూపంలో అమ్ముతారు. మినీ అవుట్‌ లెట్‌ తరహాలోనే అన్నిరకాల ఉత్పత్తులు డెయిలీ, సూపర్, లాంజ్‌ యూనిట్లలోఅందుబాటులో ఉంటాయి. వాటితోపాటు డెయిలీ యూనిట్‌లో కిచెన్‌తో పాటు 6–7 మంది, సూపర్‌ యూనిట్‌లో 10–15 మందికి పైగా కూర్చుని వాటిలో వండిన ఆహార పదార్థాలను భుజించేందుకు వీలుగా ఏసీ సౌకర్యంతో డైనింగ్‌ ఉంటుంది. లాంజ్‌ యూనిట్‌ పూర్తిస్థాయి రెస్టారెంట్‌ తరహాలో ఉంటుంది. ఇక్కడ కనీసం 20–30 మంది కూర్చుని వాటిలో వండిన మత్స్య పదార్థాలను అక్కడే తినేందుకు వీలుగా కంటైనర్‌ తరహాలో డిజైన్‌ చేశారు. ఈ రెస్టారెంట్స్‌లో ఫిష్‌ మసాలా, ప్రాన్‌ మసాలా, ప్రాన్‌ తవా ఫ్రై, అపొలొ ఫిష్, మసాలా ఫిష్, ఫిష్‌ పిలెట్, ఆంధ్రా చిల్లీ ఫిష్, ఆంధ్రా చిల్లీ ప్రాన్స్, మసాలా ప్రాన్స్, పెప్పర్‌ ప్రాన్స్, పాంఫ్రెట్‌ స్టీక్స్, పాంఫ్రెట్‌ హోల్,  వంజరం, పండుగప్ప ఫుల్‌ ఫిష్‌ ఫ్రై వంటి వాటితో పాటు సైడ్స్, డ్రింక్స్, బేకరీ, ఫ్రూట్‌ ఐటమ్స్, అన్ని రకాల ఐస్‌క్రీమ్స్‌ కూడా విక్రయిస్తారు. 

ఆక్వా హబ్‌కు అనుసంధానంగా.. 
సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, మారినేట్‌ ఉత్పత్తులు, చేప, రొయ్య పచ్చళ్లను విక్రయించేందుకు వీలుగా ఆక్వా హబ్‌లకు అనుబంధంగా మినీ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్, ఈ–మొబైల్‌ 3 వీలర్‌ ఫిష్‌ వెండింగ్‌ కార్ట్స్, మొబైల్‌ 4 వీలర్‌ ఫిష్‌ అండ్‌ ఫుడ్‌ వెండింగ్‌ వెహికల్స్, డెయిలీ (ఫిష్‌ కియోస్క్‌) యూనిట్లు, సూపర్‌ (లైవ్‌ ఫిష్‌ వెండింగ్‌ సెంటర్స్‌), ఒకటి లాంజ్‌ (వాల్యూ యాడెడ్‌) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారి సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను వీటిద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు.  

విశాఖలోని ఫిష్‌ ఆంధ్ర మినీ అవుట్‌ లేట్‌

వినియోగదారులతోపాటు మత్స్యకారులకూ ప్రయోజనం 
నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్‌ వనరులను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆక్వా హబ్‌లను తీసుకొస్తున్నాం. దీనివల్ల స్థానిక వినియోగం పెరగడంతోపాటు ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. పైలట్‌ ప్రాజెక్టుగా పులివెందుల ఆక్వా హబ్‌తో పాటు దాని పరిధిలోని అవుట్‌లెట్స్, స్పోక్స్‌ను ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.  
– సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి 

మరిన్ని వార్తలు