సరదాగా సృష్టించి కటకటాల్లోకి చేరాడు

13 Apr, 2021 14:30 IST|Sakshi

పేఏటీఎం స్ఫూఫ్‌ సృష్టికర్త హితేష్‌ వర్మ 

నిందితుడు గుర్గావ్‌ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

అరెస్టు చేసి తీసుకువచ్చిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో:  పేటీఎంను పోలి ఉండే నకిలీ యాప్‌ ‘పేఏటీఎం స్ఫూఫ్‌’ యాప్‌ను తయారు చేసింది గుర్గావ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హితేష్‌ వర్మగా తేలింది. సరదాగా అతడు తయారు చేసిన ఈ యాప్‌ పలువురు వ్యాపారులు నష్టపోవడానికి కారణమైంది. నగరంలోని దక్షిణ మండల పరిధిలో దీన్ని వినియోగించిన మూడు ముఠాలు పలువురు వ్యాపారులకు టోకరా వేశాయి.

అప్రమత్తమైన పేటీఎం సంస్థ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నవీన్‌ నేతృత్వంలోని బృందం హితేష్‌ వర్మను గుర్గావ్‌లో అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరు పరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గుర్గావ్‌లోని పటౌడీ ప్రాంతానికి చెందిన హితేష్‌ వర్మ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తనకున్న పరిజ్ఞానంతో పేఏటీఎం స్ఫూఫ్‌ పేరుతో ఓ నకిలీ యాప్‌ సృష్టించాడు. దీన్ని కొన్నాళ్ల క్రితం వరకు గూగుల్‌ ప్లేస్టోర్స్‌లో ఉంచాడు. అనేక మంది ఈ స్ఫూఫ్డ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సాధారణ పేటీఎం యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు లావాదేవీ పూర్తయిన తర్వాత ఆ విషయం నగదు చెల్లించిన వ్యక్తి ఫోన్‌ స్కీన్ర్‌పై కనిపిస్తుంది.

కొద్ది క్షణాల్లోనే నగదు పొందిన వ్యక్తి ఫోన్‌కూ సందేశం వస్తుంది. అయితే స్ఫూఫ్డ్‌ యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపినట్లు వ్యాపారుల్ని నమ్మిస్తారు. ఈ యాప్‌ దుకాణదారుడి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయదు. డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తే ఆ వ్యాపారి పేరు, ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని వాటిని ఈ నకిలీ యాప్‌లో ఎంటర్‌ చేస్తాడు. ఆపై నిరీ్ణత మొత్తం పొందుపరిస్తే... నిజమైన పేటీఎం యాప్‌ మాదిరిగానే చెల్లించిన వ్యక్తి ఫోన్‌పై లావాదేవీ పూర్తయినట్లు డిస్‌ప్లే వస్తుంది. అయితే ఆ నగదు అందుకున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి సందేశం రాదు. తమ ఫోన్‌లో వచి్చన సందేశాన్ని చూపించిన కొందరు మోసగాళ్లు క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి జారుకునేవారు. సాంకేతిక కారణాలతో తమకు సందేశం రావడం ఆలస్యమైందని భావిస్తున్న వ్యాపారులు వేచి చూసి మోసపోయే వారు.

నగరానికి చెందిన మూడు తొలుత పాతబస్తీలోని చిన్న చిన్న దుకాణాలు, జ్యూస్‌ సెంటర్ల వద్ద ఈ స్ఫూఫ్డ్‌ యాప్‌తో ‘ట్రయల్‌ రన్‌’ చేశారు. అక్కడ సక్సస్‌ కావడంతో పెద్ద దుకాణాలపై పడ్డారు. కంచన్‌బాగ్‌ పరిధిలోని ఓ వస్త్ర దుకాణంలో రూ.28 వేలు, చంద్రాయణగుట్టలోని స్పోర్ట్స్‌ స్టోర్‌లో రూ.8500, కిరాణా షాపులో రూ.10,700, మీర్‌చౌక్‌లో ఉన్న బంగారం దుకాణంలో రూ.28 వేలు వెచి్చంచి ఉంగరం ఖరీదు చేసి మోసం చేశాయి. వీళ్ల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేటీఎం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ అధికారులు హితేష్‌ వర్మను పట్టుకున్నారు.  
చదవండి:
విషాదం నింపిన అమెరికా పర్యటన..
ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో..

మరిన్ని వార్తలు