క్రిప్టో అకౌంట్‌ హ్యాక్‌.. అకౌంట్లో కోట్ల విలువైన కరెన్సీ.. రూ. 92 లక్షలు స్వాహా  

17 Mar, 2022 10:55 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌: క్రిప్టో కరెన్సీ చేసే ట్రేడర్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ అకౌంట్‌లో ఉన్న రూ. 2 కోట్లలో సుమారు రూ. 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఉషారాణి బుధవారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన బినాన్స్‌లో ఈమెకు అకౌంట్‌ కూడా ఉంది. ఆ అకౌంట్‌లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది.

ఇటీవల ఉషారాణి అకౌంట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. యూఎస్‌డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 92 లక్షలను మన దేశ కరెన్సీ కింద కన్వెర్ట్‌ చేసి వివిధ అకౌంట్‌లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 

ఎస్‌బీఐ ఖాతా నుంచి... 
తన అకౌంట్‌ను హ్యాక్‌ చేసి డబ్బు కాజేశారంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... సదరు వ్యక్తి కొంతకాలంగా ఆస్ట్రేలి యాలో నివాసం ఉంటున్నారు. అతనికి జూబ్లీహిల్స్‌లోని ఎస్‌బీఐలో ఖాతా ఉంది. ఈ ఖాతా ద్వారానే తన లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ఆయనకు కాల్‌ చేసి ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.

మీ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని చెప్పి నమ్మించాడు. ఎనీడెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి, పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. అనంతరం తన ఖాతా నుంచి రూ. 13.84 లక్షలను వేరే అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు