మిస్సింగ్‌ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి..

6 Mar, 2021 09:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాలికపై యువకుడి లైంగికదాడి.. నిందితుడి అరెస్టు

కంటోన్మెంట్‌: మైనర్‌ బాలికపై లైంగికదాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన మేరకు.. ఒంగోలుకు చెందిన బాలిక గతేడాది బోయిన్‌పల్లిలోని పెద్దమ్మ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన ఇర్షాన్‌ (25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇర్షాన్‌ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

గత బుధవారం బాలిక పెద్దమ్మకు చెప్పకుండా వెళ్లింది. బాలిక ఆచూకీ దొరకకపోవడంతో బంధువులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా బాలిక ఇర్ఫాన్‌తో కలిసి వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక గుంటూరుకు వెళ్లినట్లు ఇర్షాన్‌ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

బంధువుల ఆందోళన 
విషయం తెలుసుకున్న బీజేపీ, ఎమ్మార్పీఎస్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఎమ్మార్పీఎస్‌ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్, బేగంపేట ఏసీపీ నరేశ్‌ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు బోయిన్‌పల్లి పీఎస్‌కు చేరుకున్నారు. డీసీపీ కల్మేశ్వర్‌ ఆందోళన కారులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

హుస్సేన్‌ సాగర్‌లో దూకి యువకుడి ఆత్మహత్య 
రాంగోపాల్‌పేట్‌: హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంగోపాల్‌పేట్‌ పోలీసులు తెలిపిన మేరకు..చిలకలగూడకు చెందిన అజీజ్‌ఖాన్‌ (23) మూర్ఛవ్యాధితో  బాధపడుతున్నాడు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన శుక్రవారం హుస్సేన్‌ సాగర్‌లో శవమై తేలాడు. రాంగోపాల్‌పేట్‌ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. చొక్కాపై ఉండే టైలర్‌ స్టిక్కర్‌ ఆధారంగా మృతుడిని గుర్తించారు.   

మరిన్ని వార్తలు