బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొన్న 4 కార్లు!

6 Mar, 2023 10:00 IST|Sakshi
అనూష్‌ రావు, పవన్‌ కళ్యాణ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌): మద్యంతో పాటు గంజాయి సేవించి అదుపుతప్పిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ముదిగొండ అనూష్‌ రావు (22), కొత్తపేటకు చెందిన పవన్‌ కళ్యాణ్‌రెడ్డి (22) స్నేహితులు. శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. గంజాయి కూడా తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ నుంచి వీరిద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు.

మత్తులో డ్రైవింగ్‌..
సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతూ అదుపుతప్పిన వేగంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 నుంచి దూసుకెళ్తున్నారు. మాదాపూర్‌లోని సౌండ్స్‌ అండ్‌ స్పిరిట్స్‌ పబ్‌లో సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన అజ్మత్, విజయ్‌కుమార్‌ బౌన్సర్లుగా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని తెల్లవారుజామున బైక్‌పై బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 నుంచి వెళ్తుండగా క్రీమ్‌స్టోన్‌ వద్ద వెనక  నుంచి వేగంగా వచ్చిన అనూష్‌ రావు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అజ్మత్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.  విజయ్‌కుమార్‌ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అనూష్‌రావు స్కూటర్‌ను ఢీకొట్టి పక్కకు తిప్పే క్రమంలో అక్కడ మరో కారును ఢీకొట్టాడు.

ఆ కారు రోడ్డుకు అడ్డం తిరగడంతో వెనకాల వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి కారకులైన అనూష్‌రావు, పవన్‌ కళ్యాణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేశారు. ఇద్దరూ మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్‌ కూడా తీసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో గంజాయి నింపిన సిగరెట్లతో పాటు 50 గ్రాముల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనూ‍ష్‌ రావు, పవన్‌ కళ్యాణ్‌రెడ్డిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్‌ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కారు అనూష్‌ రావు తల్లి పేరు మీద ఉన్నట్లుగా తేలింది.

చదవండి: నల్గొండ కాంగ్రెస్‌లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్‌!

మరిన్ని వార్తలు