ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ

8 Sep, 2022 04:35 IST|Sakshi
జయప్రకాష్‌నాయుడు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్‌ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలోని 32 జిల్లాల్లోని చెరువుల్లో ఉచితంగా  చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర  మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో  టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జన సేన నాయకుడు గుండా జయప్రకాష్‌ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్‌ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.  

మరిన్ని వార్తలు