కర్ణాటకలో అర్ధరాత్రి ఘోర విషాదం 

16 Sep, 2020 07:50 IST|Sakshi

కారును వెనుక నుంచి ఢీకొన్న లారీ  

తల్లీ, ఇద్దరు కుమారులు మృతి  

చిక్కబళ్లాపుర వద్ద దుర్ఘటన  

బెంగళూరు : కర్ణాటకలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తల్లీ, ఇద్దరు కొడుకులు దుర్మరణం పాలయ్యారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. చిక్కబళ్లాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారి– 7 మీద దొడ్డబైలగుర్కి గ్రామం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్విఫ్ట్‌ కారును వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా అందులోని జయశ్రీ (50), ఆమె కుమారులు అక్షయ్‌ (28), హర్ష (24) సంఘటనాస్థలంలోనే మరణించారు. వివరాలు.. దినేశ్‌ (53) బెంగళూరు జిగణిలో టైల్స్‌ షోరూం నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం హైదరాబాద్‌. పనిమీద కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు.

దొడ్డబైలగుర్కి గ్రామం దగ్గర రోడ్డు హంప్స్‌ ఉన్నందున కారును నిదానం చేస్తుండగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. జయశ్రీ, ఆమె కొడుకులు ప్రాణాలు కోల్పోగా, దినేశ్‌కు తీవ్రగాయాలు తగిలాయి. స్థానికులు గమనించి అంబులెన్స్‌ ద్వారా మృతదేహాలను, బాధితున్ని చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన లారీడ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి పారిపోయాడు. చిక్కబళ్లాపురం రూరల్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. లారీడ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.   

ప్రమాదాల నిలయం  
ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో అనేకసార్లు యాక్సిడెంట్లు సంభవించాయి. కారణం ఇక్కడ వేసిన హంప్స్‌ వల్ల. వేగంగా వచ్చే వాహనదారులు హంప్స్‌ చూడగానే స్లో చేస్తారు. ఇంతలో వెనుక నుంచి వచ్చే భారీ వాహనాలు అదుపుతప్పి ఢీకొట్టడం పరిపాటిగా మారింది. తరచూ రక్తపాతం సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హంప్స్‌ను తొలగించండి, లేదా హెచ్చరిక బోర్డులు, సిగ్నల్‌ లైట్లు వేయాలని డిమాండ్‌ చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా