టైల్స్‌ మేస్త్రి దారుణ హత్య

13 Jun, 2021 08:13 IST|Sakshi
అప్పన్న (పాతచిత్రం)

తలపై మోది, ఫారెస్టు గుంతలో పడేసిన వైనం

రాజమహేంద్రవరం రూరల్‌: లాలాచెరువు రూపానగర్‌ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తికి హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హతుడిని రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్‌ మూడు సింహాలు ప్రాంతానికి చెందిన అడ్డూరి అప్పన్న(52)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అప్పన్న టైల్స్‌ మే్రస్తిగా పని చేస్తుంటాడు. ఈ నెల ఎనిమితో తేదీన ఇంటి నుంచి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఎప్పుడైనా పనికి వెళ్తే అతడు మూడు నాలుగు రోజులకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అప్పన్న కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పన్న స్కూటర్‌ రూపానగర్‌ – శ్రీరాంపురం వెళ్లే రోడ్డులో ఉందని అతడితో పనిచేసే వ్యక్తులు శనివారం గమనించి, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే అతడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఆ పరిసరాల్లో పరిశీలించగా ఫారెస్టు గుంతలో అప్పన్న మృతదేహం కనిపించింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి, ఎస్సై లు జగన్‌మోహన్‌రావు, శివాజీ, శుభశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాయితో మోది, మృతదేహాన్ని ఫారెస్టు గుంతలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని అర్బన్‌ జిల్లా ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండలం డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ కూడా పరిశీలించారు. ఈ హత్యకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి, ఎస్సైలను ఆదేశించారు. అప్పన్న కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై జగన్‌మోహన్‌రావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

అనుమానాలెన్నో.. 
అప్పన్న హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. అప్పన్నకు మద్యం తాగే అలవాటు ఉంది. అయినప్పటికీ బయటి వ్యక్తులతో ఎటువంటి గొడవలూ పెట్టుకోడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలిసిన వ్యక్తితో కలిసి మద్యం తాగేందుకు తన స్కూటర్‌పై వెళ్లి ఉండవచ్చని, రూపానగర్‌ ప్రాంతంలో మద్యం తాగి ఉంటారని భావిస్తున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఏమైనా గొడవలు రావడంతో ఈ హత్య జరిగి ఉంటుందేమోననే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే వివాహేతర సంబంధం కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అప్పన్న సెల్‌ఫోన్‌కు వచ్చిన చివరి కాల్స్‌ ఎవరి నుంచి వచ్చాయి, అతడు చివరి ఫోన్‌ ఎవరికి చేశాడనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడనుకుని ఎదురు చూస్తున్నామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని అప్పన్న భార్య, కుమారుడు, కుమార్తె రోదిస్తున్నారు. ఎవరితోనూ ఎటువంటి విభేదాలూ లేని వ్యక్తిని ఎవరు మట్టుపెట్టారోనంటూ బోరున విలపిస్తున్నారు. తమ కుటుంబానికి దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

చదవండి: మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య 
చనిపోయినా వీడి పోలేక.. 

మరిన్ని వార్తలు