మహిళను వంచించి.. పెళ్లొద్దన్న ఎంపీ కుమారుడు!

18 Nov, 2023 08:39 IST|Sakshi

సాక్షి,బళ్లారి: బళ్లారి లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప తనయుడు రంగనాథ్‌పై వంచన కేసు నమోదైంది. శుక్రవారం బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌– 420, 417, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. వివరాలు.. మైసూరు మహారాజా కాలేజీలో ఎంపీ తనయుడు రంగనాథ్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకుని వదిలేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని తెలిపింది.  

నాకూ ఫోన్‌ చేసింది: ఎంపీ  
ఈ ఘటనపై ఎంపీ దేవేంద్రప్ప దావణగెరె జిల్లా అరసికెరెలో స్పందించారు. తన కుమారుడిపై కుట్రతో కేసు నమోదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం ఓ మహిళ తనకు కూడా ఫోన్‌ చేసి తన కొడుకు గురించి ఫోన్‌లో చెప్పిందన్నారు. అయితే తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టులు ఉన్నాయని సూచించానన్నారు.  

ఆమె డబ్బు కోసం బెదిరిస్తోంది: రంగనాథ్‌ 
మైసూరు: డబ్బుల కోసం యువతి ఒకరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందని మైసూరులోని మహారాజ కళాశాల లెక్చరర్‌ రంగనాథ్‌ (42) విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. తన స్నేహితుడు అయిన కల్లేష్‌ అనే వ్యక్తి నుంచి దేవిక (24) అనే యువతి పరిచయమైంది. 2, 3 సార్లు ఆమె కలిసిన తరువాత ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ నేను ప్రేమించడం లేదని చెప్పినట్లు రంగనాథ్‌ అన్నారు. 

పెళ్లి చేసుకుంటానని మోసగించాడు 
బనశంకరి: బళ్లారి ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్‌ అమ్మనాన్నకు పరిచయం చేస్తానని తెలిపి ప్రైవేటు హోటల్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నారని ఓ యువతి  ఆరోపించింది. వివాహం చేసుకుంటానని  నమ్మించి  నన్ను మోసం చేశాడని  శుక్రవారం బెంగళూరు బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. తరువాత ఆమె విలేకరులతో మాట్లాడింది. అతనికి గతంలోనే వివాహమైనట్లు తనకు తెలియదన్నారు. పెళ్లి చేసుకోవాలని నేను ఎంత బ్రతిమాలినప్పటికీ ఒప్పుకోలేదు, డబ్బు ఇస్తాను, నన్ను వదిలి వెళ్లిపో అని ఒత్తిడి చేశాడని ఆమె పేర్కొంది.    

మరిన్ని వార్తలు