రూ.300 కోట్లకు ముంచేశాడు.. ఆన్‌లైన్‌ ప్రాజెక్టు పేరిట భారీ మోసం

26 Nov, 2021 10:34 IST|Sakshi
ఘరానా మోసగాడు నాగేశ్వరరావు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా ఆన్‌లైన్‌ ప్రాజెక్టు పేరిట భారీ మోసం

అధిక లాభాల ఆశ చూపి 4 వేల మందిని మోసగించిన ఘనుడు

ఈ నెల 23న కుటుంబంతో పరారీ

లబోదిబోమంటున్న బాధితులు

ఎచ్చెర్ల క్యాంపస్‌(శ్రీకాకుళం జిల్లా): పెట్టుబడి పెట్టండి.. లాభాలొస్తాయి.. అని చెప్పాడు. కొద్దిరోజులు కొందరికి లాభాలు ఇచ్చాడు. తరువాత వేలమంది పెట్టుబడి పెట్టారు. వీరంతా రూ.300 కోట్ల వరకు అతడికి ఇచ్చినట్లు తెలిసింది. అంతే.. ఆయన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఏడాదిగా ఎచ్చెర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సూర్య నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌ ప్రాజెక్టులు సంపాదించి వాటితో వ్యాపారం చేసేవాడు.

పలువురు విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేసి ఈ ప్రాజెక్టు పనులు చేసేందుకు ఉద్యోగాలిచ్చాడు. ఈ ప్రాజెక్టులు సాగుతుండగానే మరో భారీ మోసానికి తెరతీశాడు. ఈ ఆన్‌లైన్‌ ప్రాజెక్టుల్లో తనతోపాటు పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. ఈ మాటలు నమ్మిన కొందరు మొదట్లో నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. వారికి నెలనెలా రూ.5 వేల వంతున లాభాల పేరిట ఇచ్చేవాడు. ఇదిచూసి మరికొందరు పెట్టుబడి పెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, హైదరాబాద్‌ నుంచి కూడా అనేకమంది ఆకర్షితులయ్యారు.

దాదాపు 4 వేలమంది సుమారు రూ.300 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. వీరిలో కొందరు రూ.60 లక్షల వరకు ఇచ్చిన వారున్నారు. డబ్బు తీసుకున్నట్లు కొందరికి చేత్తో రాసి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టినవారికి లాభాల పేరుతో ఇస్తున్న డబ్బును మూడు నెలలుగా ఇవ్వడంలేదు. అడిగినవారికి ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వర్క్‌ పరిస్థితి మెరుగ్గా లేదని, కొన్ని రోజుల్లో బాగుపడుతుందని చెప్పేవాడు. పెట్టుబడి పెట్టినవారి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలతో సహా నాగేశ్వరరావు అదృశ్యమయ్యాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడున్నారు. నాగేశ్వరరావు కనిపించడంలేదని తెలిసిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు. గురువారానికి 50 మంది వరకు ఎచ్చెర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల్లో నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.

ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం
ఎస్‌ఎం పురానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఎచ్చెర్లలో సూర్య నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌ ప్రాజెక్టు పేరుతో డిపాజిట్లు స్వీకరించినట్లు కొందరు స్టేషన్‌కు వచ్చి చెప్పారు. రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలు, రాత పూర్వక ఫిర్యాదు వస్తే దర్యాప్తు ప్రారంభిస్తాం. 
 కె.రాము, ఎస్‌ఐ, ఎచ్చెర్ల 
 

మరిన్ని వార్తలు