సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! 

7 May, 2021 06:40 IST|Sakshi
పావుగంటలో పనిముగించుకొని వచ్చిన దారిలోనే వెళ్తూ..  

చీమకుర్తి ఫర్నిచర్‌ మాల్లో భారీ చోరీ 

ఒకరు బయట కాపలా..ఇద్దరు లోపల చోరీ 

రూ.4.60 లక్షలతో పలాయనం

రూ.4 లక్షల విలువైన మొబైల్స్‌ జోలికి వెళ్లని దొంగలు 

చీమకుర్తి(ప్రకాశం జిల్లా): ఆ మాల్‌ వద్దకు ముగ్గురు వచ్చారు. ఒకరు బయట కాపలా ఉన్నారు.. ఇద్దరు లోపలకు వెళ్లారు. క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే డబ్బులు లెక్కేసుకున్నారు. పావు గంటలో పని ముగించేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన దారిలోనే వెళ్లారు. గురువారం తెల్లవారు జామున చీమకుర్తిలోని కర్నూల్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న బీవీఎస్‌ఆర్‌ ఫర్నిచర్‌ మాల్‌లో ఈ దొంగతనం జరిగింది. షాపు యజమాని సతీష్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌ ఆస్పత్రికి సమీపంలో ఉన్న బీవీఎస్‌ఆర్‌ ఫర్నిచర్‌ మాల్‌ నాలుగంతస్తులు ఉంటుంది. మొదటి అంతస్తులో దొంగతనం జరిగింది.

రెండో అంతస్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, మూడో అంతస్తులో జిమ్‌ నిర్వహిస్తున్నారు. నాలుగో అంతస్తులో షాపు యజమానులు నివాసం ఉంటున్నారు. షాపునకు బయట, షాపు లోపల ఉన్న సీసీ పుటేజీలో ఎంత మంది దొంగలు వచ్చారు. వారు ఎలా దొంగతనం జరిగిందనే విషయాలు పూర్తిగా సీసీ పుటేజీలో రికార్డు అయింది. రోజూలాగే బుధవారం కూడా షాపులో ఫర్నిచర్‌ను అమ్మిన డబ్బులు క్యాష్‌ కౌంటర్‌లో ఉంచి దానికి తాళం వేసి రాత్రి పైన నాలుగో అంతస్తులో యజమాని కుటుంబం నిద్రించింది. దొంగతనానికి ముగ్గురు వచ్చినట్లు బయట ఉన్న సీసీ పుటేజీలో రికార్డు అయింది. ఒకరు బయట ఉన్నారు.

మిగిలిన ఇద్దరూ మొదటి అంతస్తులో డోర్‌ను చాకచక్యంగా తీశారు. లోపల క్యాష్‌ కౌంటర్‌ వద్ద ఉన్న అద్దాల బాక్స్‌లో అమ్మకానికి తెచ్చన రూ.4 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్‌ల జోలికి వెళ్లలేదు. యజమాని సెల్‌ఫోన్‌ రూ.70 వేలు ఉంటుంది. దాన్ని కూడా వారు టచ్‌ చేయలేదు. అదే అంతస్తులో విలువైన సామగ్రి, రెండో అంతస్తులో విలువైన ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా ఉన్నాయి. వాటిలో వేటిని తీసుకోకుండా కేవలం కౌంటర్‌లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే లెక్కేసుకున్నారు.

వేకువ జామున 3.15 గంటలకు మొదలైన దొంగతనం మొత్తం పావుగంట సమయంలో ముగించేసి వచ్చిన దారిలోనే వెళ్లినట్లు సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని యజమాని పోలీసులకు తెలిపారు. షాపు డోర్‌ లాక్‌ చేయకుండా వేలితో లోపల గడిని తీసే విధంగా ఉందని, దాన్ని తెలిసిన వారు తప్ప మిగిలిన వారు తీసే అవకాశం లేదని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.  షాపు యజమాని బొమ్మిశెట్టి సతీష్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగశివారెడ్డి, క్లూస్‌ టీమ్‌ సభ్యులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్రలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ 
రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..

మరిన్ని వార్తలు