భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!

22 Jul, 2021 17:38 IST|Sakshi

ఎనిమిదేళ్లుగా భారతీయ మహిళ బానిసత్వం

తిట్టి, కొట్టి చిత్రహింసలు

మెల్‌బోర్న్‌ దంపతులకు విక్టోరియా సుప్రీంకోర్టు జైలు శిక్ష

పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వా​న్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు.

మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్‌బోర్న్‌ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు.

కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్‌బోర్న్‌కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు.

ఇలా వెలుగులోకి..
కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్‌ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు