మొబీక్విక్‌ వినియోగదారులకు షాక్‌: భారీగా డేటా లీక్

30 Mar, 2021 13:09 IST|Sakshi

3.5 మిలియన్ల మొబీక్విక్‌  వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ

డార్క్ వెబ్‌లో అమ్మకానికి

ఈ ఏడాది సెప్టెంబరులో ఐపీఓ ప్లాన్‌ చేస్తున్న సంస్థ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌. లక్షలమంది మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్‌  వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది.  37 మిలియన్ల  ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు  యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి.  సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా  ఇతర తదితరాలు హ్యాకింగ్‌ గురయ్యాయని,  డార్క్ వెబ్ లింక్‌లో  ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్‌ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్‌ వార్తలతో  మొబీక్విక్‌ ఇబ్బందుల్లో పడింది.

ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి నివేదించారు.  ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు,  కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్‌కు సంబంధించి  నో-యు-కస్టమర్  వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను  విక్రయానికి పెట్టినట్టు సమాచారం.

“బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ  డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్‌ హ్యాండర్సన్‌ కూడా ట్వీట్ చేశారు. లీక్‌ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి   స్కామర్‌లకు ఈజీగా యాక్సెస్‌ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు.

యూజర్ల డేటా సేఫ్‌గా ఉంది : మొబీక్విక్‌
అయితే ఈ వార్తలను మొబీక్విక్‌ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా  దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి  ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న  సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు