రోజూ పూజలే.. ఇదేంటని అడిగితే ఎదురు సమాధానం

17 Apr, 2021 04:33 IST|Sakshi

భార్య ప్రవర్తనపై అనుమానంతో బిడ్డను వదలని తండ్రి కృష్ణ

అయినా చిన్న ఏమరుపాటుతో జరిగిపోయిన ఘోరం

హత్య విషయం గుర్తు లేదంటున్న నిందితురాలు భారతి

మోతె (సూర్యాపేట): ఆరునెలల పసిబిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. మూఢ నమ్మకాలతో కన్న తల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంతో తండా వాసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఈ దారుణ ఘటనకు ముం దు పరిస్థితుల గురించి ఆరా తీస్తే.. వారం రోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తోంది. అదీ ఎవరూ లేనప్పుడు.. అగర్‌బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతోంది.. దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే .. అంటూ దాటవేస్తూ వచ్చింది.

ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాసమైన మేకలపాడు తండాలో గురువారం భారతి తన ఆరునెలల కూతురును గొంతుకోసి బలిచ్చిన విషయం తెలిసిందే. దీం తో తండాఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఆ తండావాసులను ఎవరినీ పలకరించినా భయాందోళనలోనే ఉన్నారు.  

భారతికి ఇది రెండో వివాహం 
తండాకు చెందిన భారతికి కృష్ణతో రెండో వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్లక్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియ దు కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆమె మానసికస్థితి బాగా ఉండడం లేదని పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులక్రి తం ఒకరిని కత్తితో బెదిరించినట్లు సమాచారం.  


నిందితురాలు భారతి 

నిలదీస్తే ఎదురు సమాధానాలు..  
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫొటోతోపాటు యూట్యూబ్‌లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ల ఫొటోలకు అగర్‌బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతోంది. చుట్టుపక్కల వారికి అగర్‌బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే ‘మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తామామలకు చెప్పినా వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది. అంతలోనే భారతి కూతురును గొంతుకోసి చంపింది. ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భారతి భర్త కృష్ణ్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం నిందితురాలు భారతిని అదుపులోకి తీసుకొంటామని చెప్పారు.


రోదిస్తున్న రీతు నానమ్మ

తండా నుంచి వెళ్లగొట్టండి  
అభంశుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతిని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకును, నన్ను హత్య చేయదని గ్యారటీ ఏమిటీ. ఆమెపై మాకు అనుమానం ఉన్నా బిడ్డను చంపుతుందా? అని అనుకున్నాం. కానీ అన్నంత పనిచేసింది. మళ్లీ ఏమీ తెలియనట్లు ఉంది. ఇలాంటి కర్కోటకురాలిని కఠినంగా శిక్షించాలి.
– కృష్ణ తల్లి చంద్రమ్మ   

ఏమీ గుర్తులేదంటున్న భారతి.. 
నిందితురాలు భారతి ప్రస్తుతం తన తల్లిగారింటి వద్ద ఉంది. నీ బిడ్డను ఎందుకు హత్య చేశావని బంధువులు ప్రశ్నించగా.. ‘రీతును నేను ఎందుకు హత్య చేశానో నాకే తెలియడం లేదు’అని తాపీగా సమాధానం చెబుతోంది. అసలు హత్య చేసింది కూడా గుర్తులేదని బదులిస్తోంది.   
చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు