నల్గొండ: టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడి హత్య

15 Jun, 2021 10:10 IST|Sakshi

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

ఏడుగురిపై ఫిర్యాదు చేసిన హతుడు శంకర్‌నాయక్‌ భార్య

హత్యోదంతంలో సూత్ర, పాత్రధారులపై పోలీసుల లోతైన విచారణ

సూర్యాపేట రూరల్‌: జిల్లాలో సంచలనం సృష్టించిన రాజునాయక్‌తండా టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్‌ శంకర్‌నాయక్‌ హత్యోదంతం చిక్కుముడి వీడుతున్నట్లు తెలుస్తోంది.వివాహేతర సంబంధాలు సాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయితీలో మందలించినందుకే కక్ష పెంచుకుని మరికొందరి సహకారంతో శంకర్‌నా నాయక్‌ను పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

అందరితో కలివిడిగా..
రాజునాయక్‌ తండాలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురైన లూనావత్‌ శంకర్‌నాయక్‌ ఉన్నత విద్యావంతుడు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో సర్పంచ్‌గా పోటీచేసి స్వల్ప మె­జార్టీతో ఓడిపోయాడు. మూడేళ్లుగా టీఆర్‌ఎస్‌ గ్రా­మ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శంకర్‌­నాయక్‌ అందరితో కలివిడిగా ఉంటూ ప్రజా స­మ­స్యల పరిష్కారానికి పాటు పడుతుండేవాడు. గ్రా­మంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. 

సరికాదన్నందుకే కక్ష పెంచుకుని..
గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదే గ్రా మానికి చెందిన ఇద్దరు మహిళలతో కొంతకాలంగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, వీరి వివాదం రెండు మాసాల క్రితం పంచాయితీ పెద్దల వరకు వచ్చింది. అయితే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటున్న శంకర్‌నాయక్‌ వివాహేతర సంబంధాలు సాగిస్తున్న సదరు యువకులను పంచాయితీలో అందరిముందు మీరు అనుసరిస్తున్న తీరు తప్పని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు జరిగిన పంచాయితీలో సైతం శంకర్‌నాయక్‌ ఆ యువకులను తప్పుబట్టడడంతోనే కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

పక్కా ప్రణాళికతో..
శంకర్‌నాయక్‌ హత్యోదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే దుండగులు పక్కా ప్రణాళికతోనే  తమ పథకాన్ని అమలుచేసి మట్టుబెట్టినట్లు అవగతమవుతోంది. కొద్ది రోజులుగా శంకర్‌నాయక్‌ కదలికలను గమనిస్తూ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి శంకర్‌నాయక్‌ తన సోదరుడి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన దుండగులు మాటేసి హత్య చేసినట్లు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. శంకర్‌నాయక్‌ నాయక్‌ ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తుండడాన్ని తెలుసుకుని, అదే సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి దారుణానికి తెగబడినట్లు అర్థమవుతోంది. 

లొంగిపోయిన నలుగురు నిందితులు
రాజునాయక్‌తండా టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు లునావత్‌ శంకర్‌నాయక్‌ హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్న ట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సదరు నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తామే హత్య చేసినట్లుగా ఒప్పుకుని లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, ఈ విషయాన్ని ఎస్‌ఐ లవకుమార్‌ ధ్రువీకరించలేదు. అయితే, శంకర్‌ నాయక్‌ హత్యోదంతంలో నలుగురు యువకులే పాల్గొన్నారా..? విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, హత్య అనంతరం నిందితులు పారిపోయేందుకు సహకరించింది ఎవరు..? ఈ కేసులో సూత్ర, పాత్రధారులపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

పలువురిపై హతుడి భార్య ఫిర్యాదు
తన భర్తను రాజునాయక్‌తండాకు గ్రామానికి చెందిన సైదా, లునావత్‌ తార, భూక్యా సురేష్, భూక్యా చందర్, మహేందర్, రమావత్‌ శ్వేత, లునావత్‌ పాండునాయక్‌లే హత్య చేశారని ఆరోపిస్తూ హతుడు శంకర్‌నాయక్‌ భార్య భారతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లవకుమార్‌ తెలిపారు.

చదవండి: సైనెడ్‌తో కుక్కను చంపి.. తర్వాత ప్రియుడితో కలిసి

మరిన్ని వార్తలు