పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..

29 Nov, 2020 16:34 IST|Sakshi

ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు 

సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటనపై అన్ని‌కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11:30 గంటలకు మంత్రి పేర్నినాని పై ఆయన నివాసం వద్ద హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడు తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు.. అతని దగ్గరున్న తాపీతో రెండు సార్లు కడుపులో పొడవటానికి ప్రయత్నించాడని చెప్పారు. మొదటిసారి పొడిచినపుడు బెల్ట్‌కి గుచ్చుకోవడంతో మంత్రి అప్రమత్తమై అతనిని వెనక్కి నెట్టారు. వెంటనే మంత్రి గన్‌మెన్, సెక్యూరిటీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి)

నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడని, నాగేశ్వరరావు సోదరి ఉమాదేవి టీడీపీ మండల నాయకురాలిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మంత్రిపై హత్యాయత్నంలో ఎవరి హస్తముందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, పూర్తి కారణాలు తెలియాల్సివుందని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడిని ఆసుపత్రికి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇది రాజకీయ కోణమా.. లేక మరేదైనా ఉద్దేశమా అనేది విచారణలో తెలియాల్సివుంది. మంత్రి పేర్నినానిని కలిసి బాధను చెప్పుకోడానికి వచ్చినట్లు నిందితుడు చెబుతున్నాడు.. కానీ నిజమెంతో తెలుసుకోవాల్సి ఉంది. బాధ చెప్పుకునే వ్యక్తి.. ఆయుధంతో ఎందుకు వచ్చాడో విచారిస్తున్నాం. తాజా ఘటన నేపథ్యంలో మంత్రి భద్రతపై ఏఆర్ ఎఎస్పీతో సమీక్షిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు వెల్లడించారు.

హత్యాయత్నాన్ని ఖండించిన డిప్యూటీ సీఎం 
మచిలిపట్నం: పేర్నినానిపై హత్యాయత్నాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఖండించారు. ఆయన మంత్రి పేర్ని నానిని పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు రాబట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆళ్ల నాని అన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా