పెళ్లయి 11 రోజులు.. మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు

14 Jan, 2021 08:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శాలిగౌరారం(నల్గొండ): పెళ్లయిన 11 రోజులకు.. మొదటి రాత్రే వరుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. అనంతరం సంప్రదాయానుసారం 11వ రోజున మొదటిరాత్రికి మంగళవారం రాత్రి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలో సోమేశ్‌ తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అన్న ఫోన్‌ చేయగా సోమేశ్‌ ఫోన్‌ ఎత్తలేదు. అంతలో అతని స్నేహితులు రాత్రయిందంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. చదవండి: ఏడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి..


గోళ్ల సోమేశ్‌ (ఫైల్‌ ఫొటో)

సోమేశ్‌ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి, గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పూరింట్లోకి వెళ్లి తాడుతో వెన్నుకర్రకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క సోమేశ్‌ కోసం బంధువులు ఫోన్‌లో ప్రయత్నిస్తూనే రాత్రంతా ఎదురుచూశారు. బుధవారం తెల్లవారుజామున అతడి స్నేహితులను వాకబు చేయగా ఇంటికి వెళ్తున్నానని చెప్పాడని తెలిపారు. దీంతో చుట్టుపక్కల గాలించగా, పూరి గుడిసెలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు

చెట్టును ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు మృతి
జోగిపేట(అందోల్‌): సింగూర్‌ ప్రాజెక్టు చూసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌ కుమారులు ఎండీ అబ్దుల్‌ సమీర్‌ (18), ఎండీ అబ్దుల్‌ జమీర్‌ (16)లతో పాటు గఫార్‌ అక్క కొడుకైన తోఫిక్‌ (18)లు మంగళవారం సింగూరు ప్రాజెక్టు చూసేందుకు తమ బంధువు బైకుపై (టీఎస్‌ 13 ఈఎన్‌ 0722) బయలుదేరారు. రెండు నిమిషాల్లో ప్రాజెక్టు వద్దకు చేరుకుంటామనే సమయంలో మూలమలుపు వద్ద బైకు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా.. బైక్‌ నడిపిన తోఫిక్‌తో పాటు అబ్దుల్‌ సమీర్‌ మృతి చెందాడు.

గాయపడ్డ జమీర్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా అతను కూడా మరణించాడు. సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్‌ క్షణాల్లో చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. దీంతో యువకుల ప్రమాదం సంఘటన.. మృతి చెందారన్న వార్త బుధవారం వరకు బయటకు తెలియలేదు. సింగూరులో జరిగిన విందుకు హాజరైన అనంతరం డ్యాం వద్దకు వెళ్తుండగా బైక్‌ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లుగా ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు