సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా

13 Mar, 2021 09:23 IST|Sakshi

కేపీహెచ్‌బీకాలనీ:  బైక్‌లు నడపాలనే సరదా చోరీలు చేసేలా తయారు చేసింది. మూడు బైక్‌లను దొంగిలించి కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కాడు. వాహనాలను స్వాదీనం చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆ యువకుడిని రిమాండ్‌కు తరలించారు. డీఐ నాగిరెడ్డి తెలిపిన మేరకు.. హైటెక్‌ సిటీ ప్రాంతంలోని చందానాయక్‌ తండాలో నివాసముండే ఇత్తడి అరుణ్‌(19) కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆఫీస్‌బాయ్‌. ఇతడి తల్లిదండ్రులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అరుణ్‌కు బైక్‌ల మీద దూసుకువెళ్లాలనే సరదా ఉండేది. దీంతో బైక్‌లను దొంగిలించి తన సరదా తీర్చుకునేవాడు.

ఈ క్రమంలోనే రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక బైక్, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో బైక్‌ను దొంగిలించాడు. ఈ రెండు బైక్‌లు నచ్చకపోవటంతో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మరో బైక్‌ను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం జేఎన్‌టీయూ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న కేపీహెచ్‌బీ పోలీసులకు నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌పై తిరుగుతూ అటువైపుగా వచ్చిన అరుణ్‌ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోగా బైక్‌కు సంబంధించిన పత్రాలు అతడి వద్ద లేవు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
చదవండి:  
తల్లీ-కొడుకు బైక్‌పై  వెళ్తుండగా ప్రమాదం

మరిన్ని వార్తలు