జైలులో స్నేహం.. బయటకు వచ్చాక..

21 Dec, 2021 10:55 IST|Sakshi

సాక్షి,కోస్గి(మహబూబ్‌నగర్‌): గతంలో చేసిన వేర్వేరు దొంగతనాల కేసుల్లో కటకటాలు లెక్కపెట్టిన ముగ్గురు యువకులు జైలులోనే స్నేహితులుగా మారారు. బయటికి వచ్చిన తర్వాత వీరు ఓ ఓమ్నీ కారు కొనుగోలు చేసి, రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డారు. ఇదిలాఉండగా కోస్గి పరిధిలో నెల వ్యవధిలోనే పదుల సంఖ్యలో వరుస చోరీలు చోటుచేసుకోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఎట్టకేలకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఆ వివరాలను సీఐ జనార్దన్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఠాలో జడ్చర్ల నిమ్మగడ్డ బావి ప్రాంతానికి చెందిన బొంతల మూర్తి, దేవరకద్రకు చెందిన చెక్క గోపి అశోక్, హన్వాడకు చెందిన ఆర్కెపల్లి చంద్రశేఖర్‌ ఉన్నారు. ఈనెల 11న తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుండుమాల్‌కు చెందిన వెంకటయ్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 14న వాహనాలను తనిఖీలు చేస్తుండగా మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్ట్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఇనుప రాడ్, ఇతర సామగ్రితో వచ్చిన వీరిని పట్టుకొని పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు.

దీంతో చోరీల బాగోతం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసుల సమగ్ర దర్యాప్తులో వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీరి నుంచి కోస్గి పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబందించి రూ. 1.25లక్షల విలువైన బంగారు నగలు, 44.5 తులా ల వెండి ఆభరణాలు రికవరీ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆభరణాలు రికవరీ చేసి ఆయా స్టేషన్లకు అప్పగించారు. కాగా బొంతల మూర్తిపై జడ్చర్ల, నల్లగొండ జిల్లా దేవరకొండలో, అశోక్‌పై బాలానగర్‌ పోలీసులు, చంద్రశేఖర్‌పై జడ్చర్ల పోలీసులు పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. కేసును సీఐ జనార్దన్‌ సమక్షంలో ఛేదించిన ఎస్సై నరేందర్, పీసీ మహేందర్, ఆంజనేయులును జిల్లా పోలీసు అధికారులు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు