తుక్కు కింద కుక్కి

30 Nov, 2021 02:06 IST|Sakshi
పట్టుబడ్డ గంజాయి లారీ 

లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

రూ.60 లక్షలు విలువ చేసే 6 క్వింటాళ్ల సరుకు స్వాధీనం 

సంగారెడ్డి జిల్లా కంది వద్ద పట్టుకున్న పోలీసులు  

పరారీలో ప్రధాన సూత్రధారి

సంగారెడ్డి అర్బన్‌: అనుమానం రాకుండా ఇనుప తుక్కు లోడ్‌ కింద రహస్యంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్‌ వైపు వెళుతున్న ఓ లారీని సంగారెడ్డి రూరల్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలసి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కంది చౌరస్తాలో తనిఖీ చేయగా గుట్టుగా గంజాయిని తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆరు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన సూత్రదారి పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా మాలెగావ్‌ గ్రామానికి చెందిన అనిల్‌ గోవింద్‌ చిరు వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గణేశ్‌ నందకిషోర్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లి వాసి అనిల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడ్డారు.

ఈ క్రమంలో గంజాయిని మహారాష్ట్రలోని పండరీపూర్‌కి తరలిస్తే రూ.50 వేలు ఇస్తానని అనిల్‌రెడ్డి చెప్పడంతో మిగతా ఇద్దరు ఏపీలోని తుని వద్ద ప్లాస్టిక్‌ సంచుల్లో ఆరు క్వింటాళ్ల గంజాయిని ఇనుప స్క్రాప్‌ కింద లారీలో లోడ్‌ చేశారు. అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్‌ వైపు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారి అనిల్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు