నాది హామీ..కోటి టన్నులైనా కొంటాం

30 Nov, 2021 02:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘వానాకాలానికి సంబంధించి తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను చివరివరకు కొంటాం. ఈ సీజన్‌లో ఎంతమేర ధాన్యం సేకరించాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి మించి ధాన్యం వచ్చినా సేకరిస్తాం. ఎంతైనా కొంటాం.. అది కోటి మెట్రిక్‌ టన్నులు అయినాసరే. పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం అన్నతేడా లేకుండా కనీస మద్దతు ధరలతో తీసుకునేందుకు సిద్ధం. ఈ విషయంలో తెలంగాణ రైతాంగానికి కేంద్రమంత్రిగా నాది హామీ’’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు.

సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా, చెపితే చూపించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 25 రోజులుగా కొనుగోళ్లను నిలిపేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని.. ధాన్యాన్ని మిల్లులకు పంపించే సోయి లేదుగానీ కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అసంబద్ధ నిర్ణయాల వల్లే రైతులు గందరగోళంలో పడ్డారని.. కొనుగోళ్లు జరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం కేసీఆర్‌ తీవ్రంగా భయపడుతున్నారని.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడో లేడో అన్న ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పుత్ర వాత్సల్యం ప్రగతిభవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకుందని, అందుకే లేని సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

యాసంగి ప్రణాళిక రాష్ట్రానిదే.. 
యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని.. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటలకు విత్తనాలు, ఎరువులు, రుణాలపై ఓ విధానం రూపొం దించుకోవాల్సింది రాష్ట్రమేనని.. దానిని వదిలేసి కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. పంజాబ్‌లోనైనా, తెలంగాణలోనైనా కేంద్రం ఒకే విధానంతో ముందుకెళుతుందని.. సీఎం కేసీఆర్‌ తరహాలో గజ్వేల్‌కు ఓ న్యాయం, దుబ్బాకకు మరో న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు