టెట్‌ పరీక్షలో విషాదం.. ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణి మృతి

15 Sep, 2023 12:21 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్‌ సెంటర్‌లో మృతి చెందిన పటాన్‌చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. 

గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్‌ పడింది.   బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్‌లోనే కుప్పకూలి పడిపోయింది. 

హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్‌ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు