డబుల్‌ మర్డర్‌ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

19 Oct, 2023 16:13 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచ‌ల‌నం సృష్టించిన ఇబ్రహీంప‌ట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది.

క‌ర్ణంగూడ గ్రామ‌ స‌మీపంలో ఇద్దరు భాగ‌స్వాములైన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీ‌నివాస్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాఘ‌వేంద‌ర్‌రెడ్డిలు 10 ఎక‌రాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి త‌న‌దేనంటూ మ‌ట్టారెడ్డి దాన్ని క‌బ్జా చేశారు. ఈ విష‌యంలో వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ‌నివాస్ రెడ్డి మ‌రో వ్యక్తితో క‌లిసి సైట్ వ‌ద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మ‌ట్టారెడ్డితో వాగ్వాదం జ‌రిగింది.

ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌ట్టారెడ్డి ఇత‌రుల‌తో క‌లిసి శ్రీ‌నివాస్‌రెడ్డి, రాఘ‌వేంద‌ర్‌రెడ్డిపై కాల్పులు జ‌రిపారు. శ్రీ‌నివాస్ అక్కడిక‌క్కడే చ‌నిపోగా, రాఘ‌వేంద‌ర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హ‌త్య అనంత‌రం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మ‌ట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల‌కు విచార‌ణ మ‌రింత సులువు అయ్యింది.

అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌రపగా మ‌ట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హ‌త్యలు చేయించిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి,  రాఘవేందర్‌రెడ్డిలను  హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది.
చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం 

మరిన్ని వార్తలు