స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు | Sakshi
Sakshi News home page

స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు

Published Tue, Oct 17 2023 11:26 AM

Supreme Court Verdict On Same Sex Marriage Case - Sakshi

ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు  3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం  గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల  హక్కులు,  అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది.

స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్‌లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

కాగా, 2018 సెప్టెంబర్‌లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది.

స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్‌ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 

మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం  తన అఫిడవిట్‌ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్‌ మాట. ఆ సెక్షన్‌ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని  ఆందోళన వ్యక్తం చేస్తూ..  ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది.

ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్‌!

స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు..


1. మరణ శిక్ష
2. జీవితకాల ఖైదు
3. జైలు శిక్ష
4. హక్కులు లేవు
5. చట్టప్రకారం శిక్షలు
6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు
7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు
8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు

Advertisement

తప్పక చదవండి

Advertisement