భార్యపై అనుమానం..అర్ధరాత్రి దాటాక తలపై కటింగ్‌ ప్లేయర్‌తో పొడిచి..

8 Oct, 2022 09:09 IST|Sakshi
జన్ను అరుణ (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: పచ్చని సంసారంలో అనుమానం చిచ్చురేపింది. ఆ ఇల్లాలి పాలిట అదే పెనుభూతమైంది. చివరికి హతమార్చింది. అనుమానంతో వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన జన్ను అరుణ(38)ను భర్త నరేశ్‌ శుక్రవారం హత్య చేశాడు. నరేశ్‌ ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం నర్సంపేట మండలం మగ్ధుంపురం గ్రామానికి చెందిన కోడూరి కట్టయ్య కూతురు అరుణతో వివాహం జరిగింది. అరుణ ఆశ కార్యకర్తగా పని చేస్తోంది. వారికి కూతురు, కుమారుడు జన్మించారు. అరుణను నిత్యం నరేశ్‌ అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు.

పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి ఆమెను కాపురానికి పంపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పిల్లలను తీసుకుని దంపతులు మగ్ధుంపురం వెళ్లి గురువారం రాత్రి అమీనాబాద్‌కు తిరిగి వచ్చారు. అర్ధరాత్రి దాటాక ఆమె తల వెనుక కటింగ్‌ ప్లేయర్‌తో బలంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నరేశ్‌ పరారయ్యాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన కూతురు, కుమారుడు రక్తపు మడుగులో ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి కేకలు వేస్తూ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు.

నెక్కొండ సీఐ హత్తిరాం, ఎస్సై సీమా పర్వీన్‌ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను విచారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతురాలి కుటుంబీకులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు