హైవేపై దారి దోపిడీ..రైతు నుంచి దోచేశారు

2 Mar, 2021 08:28 IST|Sakshi
వివారాలు తెలుసుకుంటున్న డీఎస్పీ

రైతు వద్దనుంచి రూ.6.40 లక్షలు  ఎత్తుకెళ్లిన దుండగులు 

శాలిగౌరారం/నల్గొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించిన దుండగులు రూ.6.40 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని పెర్కకొండారం సమీపంలో జాతీయ రహదారి–365పై సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఐ హరి బా బు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చెరుకు నర్సయ్య నకిరేకల్‌ ఐసీఐసీఐ బ్యాంకులో తన పొలాన్ని కుదువబెట్టి పైపులైన్‌ నిర్మాణానికి రుణం తీసుకున్నాడు. సన్నిహితుడితో కలిసి బ్యాంకుకు వెళ్లిన నర్సయ్య బ్యాంకులో నగదును తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై నకిరేకల్‌ నుంచి 365వ నంబర్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్నాడు.

ఈ క్రమంలో పెర్కకొండారం సమీపంలో జాతీయ రహదారిపై వంతెన నిర్మాణం జరుగుతుండడంతో పక్కనుంచి వేసిన మట్టిరోడ్డు నుంచి ద్విచక్ర వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్తేందుకు బండి దిగారు. ఇంతలో వెనుకనుంచి మరో ద్విచక్ర వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు నర్సయ్యను నెట్టివేసి అతని వద్ద రూ.6.40 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్‌ను లాక్కొని తిరిగి నకిరేకల్‌వైపు పారిపోయారు. దీంతో కిందపడిపోయిన నర్సయ్య వెంటనే లేచి లబోదిబోమంటూ కేకలు వేశాడు. అదే సమయంలో రహదారిపై వెళ్తున్న కొందరు విషయం తెలుసుకుని వెంబడించినా.. దుండగుల ఆచూకీ లభించలేదు. బాధితుడు చెరుకు నర్సయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాపు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నల్లగొండ డీఎస్పీజాతీయ రహదారి–365పై దోపిడీ జరిగిన స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకునుంచి పొందిన నగదుకు సంబంధించిన వివరాలు సేకరించారు. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలతోపాటు నకిరేకల్‌ పట్టణంలో ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేపట్టారు.  నకిరేకల్‌రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు