కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు

24 Nov, 2022 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీ నటి జీవితను టార్గెట్‌ చేసి, ఆమె మేనేజర్‌ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్‌ సీజన్‌లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్‌ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో చెఫ్‌గా పని చేశాడు. కోవిడ్‌–19 వ్యాక్సిన్లు మార్కెట్‌లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకున్నాడు.

ఇతగాడు తొలుత తాను టార్గెట్‌ చేసిన వ్యక్తుల మొబైల్‌ నంబర్‌లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్‌ ఛానెల్‌ను ఇలానే టార్గెట్‌ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్‌ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు.

ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్‌ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు.   

మరిన్ని వార్తలు