నాంపల్లి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు

14 Nov, 2023 11:13 IST|Sakshi

Updates..

ఘటనపై పోలీస్‌ కేసు నమోదు
బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది.  క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286(పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం.. అలాగే..  ఇండియన్ ఎక్స్‌ప్లోజివ్స్‌ యాక్ట్  సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.

వరుస ప్రమాదాలు.. అయినా నిర్లక్ష్యమే!: అజారుద్దీన్‌
వరుస ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వీడడం లేదని కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌ అన్నారు.  నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నివాస ప్రాంతాల్లో గోదాములు ఉన్నాయని తెలిసినా చర్యలు తీసుకో లేదు. డెక్కన్‌మాల్‌, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాదాల తర్వాత కూడా అలర్ట్‌ కాలేదు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగానే జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తోంది అని మండిపడ్డారాయన. 

రూ.5 లక్షలా?.. ఏమైనా భిక్షం వేస్తున్నారా?: సీపీఐ నారాయణ
నాంపల్లి ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీపీఐ నారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్‌ కేవలం ఐదు లలక్షల మాత్రమే ప్రకటించారు. బాధితులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా?’’ అని నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమూ ఇప్పించాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ‘రెసిడెన్షియల్‌ ఏరియాల్లో కెమికల్‌ డబ్బాల ఉంచితే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి?.. కాబట్టి నాంపల్లి ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారాయన.

నాంపల్లి ఘటన.. జనసేన చీఫ్‌ పవన్‌ స్పందన
నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కెమికల్స్‌ వల్లే ప్రమాదం జరిగిందని తెలిసిందని, నివాస ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ అధికారుల్ని కోరారాయన. 

ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఐ తమ్మినేని
నాంపల్లి కెమికల్‌ గోడౌన్‌ అగ్ని ప్రమాదంపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ మేరకు ఆయన పేరు మీద ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ.   

‘‘తొమ్మిది మంది కార్మికుల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మృతి చెందినవారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రు.20 లక్షలు అందించాలని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాము.

..హైదరాబాదులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో  కెమికల్‌ గోడౌన్లను ఉంచకుండా  శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని  సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది’’. 


అగ్ని ప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి దిగ్భ్రాంతి..
►నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం బాధాకరం. 
►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి. 
►అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి
►మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
►అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి 
►ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన ఫిరోజ్ ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాను. 

►మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా

ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి
►నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని పరిశీలించారు. 
►అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
►ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కేటీఆర్‌ ఆదేశం. 
►షార్ట్‌ సర్య్కూట్‌ లేదా టపాసుల వల్ల మంటలు వ్యాప్తించాయి. 
►ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా. 
►బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. 
►అపార్ట్‌మెంట్‌లో కెమికల్స్‌ వాడటం ప్రమాదకరం.

►కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. 

►రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి.

►అ‍గ్ని ప్రమాదంలో తన వారిని కోల్పోయి కన్నీరు పెట్టుకున్న బాధితుడు.

నాంపల్లిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్‌
►ఘటనా స్థలంలో ఫిరోజ్‌ ఖాన్‌ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు
►వీరి మధ్య వాగ్వాదం
►పోలీసులు వారించినా పట్టించుకోని నేతలు
►పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్‌.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫిరోజ్‌ ఖాన్‌
►నాంపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ ఖాన్‌. 
►ఈ క్రమంలో ఆయనను స్థానిక నేతలు అడ్డుకున్నారు. 
►దీంతో, ఫిరోజ్‌ ఖాన్‌, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
స్థానిక ఎంఐఎం నేతలపై ఫిరోజ్‌ ఖాన్‌ తీవ్ర ఆరోపణలు. 

నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
►నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
►మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 
►తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
►తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

► నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి యాజమాని రమేష్‌ జైశ్వాల్‌గా గుర్తించారు. రమేష్‌ జైశ్వాల్‌కు కెమికల్‌ ఫ్యాక్టరీలు ఉన్నట్టు గుర్తింపు. రమేష్‌ కోసం గాలిస్తున్న పోలీసులు. 30 కెమికల్‌ డబ్బాలు గుర్తింపు, కాలిపోకుండా ఉన్నవి మరో 100 డబ్బాలను గుర్తించారు.

నాంపల్లి ప్రమాదంపై రేవంత్‌ దిగ్భ్రాంతి.. 
►నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. 
►అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.
►హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. 
►అ‍గ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం.
►అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. 
►రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. 
►ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. 
►ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. 
►వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
► మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.

అగ్ని ప్రమాద స్థలికి కిషన్‌ రెడ్డి..

►ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే.. 
తూభ(5) 
తరూభ(12)
మహ్మాద్‌ ఆజమ్‌ (54),
రెహమాన్‌, 
రెహానా సుల్తానా(50)
డాక్టర్‌ తహుర ఫర్హీన్‌(38),
ఫైజా సమీన్‌(25)

సెలవుల కారణంగా పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన డాక్టర్‌ ఫరీన్‌.
మూడవ అంతస్తులో : 
(1) జకీర్ హుస్సేన్
(2) నిక్కత్ సుల్తానా

►హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

►వివరాల ప్రకారం.. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. 

►ఇక, అపార్ట్‌మెంట్‌లో  కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్య్కూ సిబ్బంది ఇప్పటికి 21 మందిని కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. 

►ఈ ప్రమాద ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి మంటలు వ్యాపించాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో మెకానిక్‌ షెడ్‌ ఉంది. కారు రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్‌ డ్రమ్స్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి. 

మరిన్ని వార్తలు