మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై నూనె చల్లి..

18 Nov, 2021 08:59 IST|Sakshi
దుర్గారావు (ఫైల్‌)

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌): మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తండ్రిపై నూనె చల్లి నిప్పంటించాడు ఓ కిరాతకుడు. గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి దుర్గారావు (55), భార్య, పెద్ద కొడుకు నాగబాబు (35)తో కలిసి ఇందిరానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. దురలవాట్లకు బానిస కావడంతో నాగబాబుకు పెళ్లి కాలేదు. దీంతో నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు.

దుర్గారావు ఆస్తమాతో బాధపడుతూ ఐదు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం తల్లి కూలీ పనులకు వెళ్లగా నాగబాబు పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డాడు. దుర్గారావు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో తండ్రిమీద, మంచం, దుప్పట్లు, కిటికీల మీద నూనె చల్లి నిప్పంటించి బయటనుంచి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయాడు.

గది నుంచి పొగరావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి దుర్గారావును బయటకు తెచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత దుర్గారావు మృతి చెందాడు. నాగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు