ఆరేళ్ల క్రితం​ ప్రమాదంలొ చనిపోయినట్లు నాటకం

11 Mar, 2021 15:07 IST|Sakshi

ఆరేళ్లక్రితం మృతిచెందిన బిక్నానాయక్‌ది 

 హత్యగానే నిర్ధారణ

కూతురు, అల్లుడే సూత్రధారులు

నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌

నాగార్జునసాగర్‌: బీమా డబ్బు కోసం చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తిది ప్రమాద మరణం కాదని.. హత్యేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. బీమా డబ్బుల కోసమే కూతురు, అల్లుడు పథకం ప్రకారం మరికొందరి సహకారంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. సీఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కుంకుడుచెట్టుతండాకు చెందిన రమావత్‌ బిక్నానాయక్‌(47) కొన్నేళ్ల క్రితం తన కూతురు బుజ్జిని దామరచర్ల మండలం పుట్టల గడ్డతండాకుచెందిన రూపావత్‌ చీనానాయక్‌ కుమారుడు భాష్యానాయక్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం తండాకు సర్పంచ్‌ ఈయనే. అయితే, భాష్యానాయక్‌ అప్పట్లోనే రమావత్‌ బిక్నానాయక్‌పై వివిధ రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలు చేయడంతో పాటు అతడి పేరిట రెండు ట్రాక్టర్లు, బొలేరోను ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. 

పథకం ప్రకారం..
బీమా పాలసీలు, వాహనాలపై ఉన్న ఫైనాన్స్‌ డబ్బులను చెల్లించకుండా ఉండేందుకు భాష్యానాయక్‌ మామ బిక్నానాయక్‌ను అంతమొందించేందుకు తన భార్య బుజ్జితో పథకం రచించాడు. అందుకు కల్లెపల్లికి చెందిన లావుడ్యా రాజేశ్వర్‌రావు, ధీరావత్‌ నరేష్, గాంధీనగర్‌కు చెందిన పోలగాని రవిల సహకారం తీసుకున్నాడు. రమావత్‌ బిక్నానాయక్‌కు 2015 ఫిబ్రవరి 22న రాత్రి మద్యం తాపారు. స్పృహకోల్పోయిన తర్వాత నెల్లికల్లు స్టేజీసమీపంలో రోడ్డుపై పడుకోబెట్టి ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారు. 

రిమాండ్‌కు తరలింపు
బిక్నానాయక్‌ మృతిని భాష్యానాయక్‌ ప్రమాదంగా చిత్రీకరించి నాగార్జునసాగర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే తరహాలో పోలీసులు కేసు నమోదు చేశారు. బిక్నానాయక్‌పై ఉన్న పాలసీలతో రూపావత్‌ భాష్యానాయక్‌–బుజ్జిదంపతులు రూ.79,65,000లు  లబ్ధిపొందారు.  ఇటీవల బీమా సొమ్ము స్వాహాపర్వంలో పొలగాని రవి అరెస్ట్‌ కావడంతో భాష్యానాయక్‌ దంపతుల దారుణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం కేసులో నిందితులైన భాష్యానాయక్, బుజ్జి, నాగేశ్వర్‌రావు, నరేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.    

మరిన్ని వార్తలు