దుస్తులు సరిగా కుట్టలేదని హత్య 

1 Jan, 2022 07:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం, పీఎంపాలెం (భీమిలి): కొత్త దుస్తులు సరిగా కుట్టలేదని ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఓ టైలర్‌పై దాడి చేయగా మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కొడుకు సుమన్‌తో మారికవలసలోని రాజీవ్‌ గృహకల్ప జీఎఫ్‌–1 బ్లాక్‌ నంబర్‌ 104లో నివసిస్తున్నాడు. ఇంటివద్దనే లిమా టైలరింగ్‌ చేస్తుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళుతుంటారు. ఇదిలా ఉండగా కాలనీకి చెందిన గణేష్‌ లిమా వద్ద కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. కొలతలు ప్రకారం సరిగా కుట్టకపోవడంతో సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరాడు.

అయితే అనుకున్న సమయానికి దుస్తులు సరిచేసి ఇవ్వకపోవడంతో టైలర్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో టైలర్‌ కుమార్తె, అల్లుడు సుశాంత్‌ ఇంట్లోనే ఉండడంతో గణేష్‌ వెళ్లిపోయాడు. అయితే గణేష్‌  తన మిత్రులు క్లింటన్, సూర్యనారాయణ మరికొందరిని వెంట తీసుకుని తిరిగొచ్చాడు. టైలర్‌ లిమాను విచక్షణారహితంగా గుండెలపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 వైద్య సిబ్బంది తెలిపారు. 

చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్‌ విద్యార్థిని మృతి..!)

మరిన్ని వార్తలు