ప్రిన్సిపాల్‌ వేధింపులు.. ఉపాధ్యాయురాలు ఆత్మహత్య  

21 Aug, 2022 07:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రధానోపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కామాక్షి అమ్మన్‌ గార్డన్‌కు చెందిన నాగేశ్వరి(56) గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాలలో టైలరింగ్‌ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె కుమారుడు విఘ్నేష్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం నాగేశ్వరి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దీనిపై కుమారుడు విఘ్నేష్‌ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాల హెచ్‌ఎం తన తల్లి నాగేశ్వరిని టైలరింగ్‌ శిక్షణకు అనుమతి ఇవ్వకుండా వేధించేవాడని, ప్రతి రోజూ గ్రంథాలయ భవనంలో విధులు నిర్వహించాలని ఆదేశించేవాడని పేర్కొన్నారు. తరచూ అసభ్య పదజాలంతో దూషించేవాడని, ఈ నేపథ్యంలో ఆనారోగ్యం కారణంగా తన తల్లి 12 రోజుల పాటు మెడికల్‌ సెలవు పెట్టిందని ఫిర్యాదులో వెల్లడించారు.

రెండు రోజుల క్రితం మెడికల్‌ సర్టిఫికెట్‌తో పాఠశాలకు వెళ్లగా హెచ్‌ఎం తన గదిలో గంట పాటు దూషించి వేధింపులకు గురి చేశాడని, మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాడానికి కూడా నిరాకరించి ఇంటికి పంపి వేశాడని ఆరోపించారు. ఆ మనోవేదనతో తన తల్లి నాగేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు