ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ, సీపీఐ నేతల దాడి

17 Feb, 2023 08:11 IST|Sakshi

సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు.. పాఠశాలల్లో నాడు - నేడు పనులు పర్యవేక్షణలో భాగంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై అనంతపురంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి పై దాడికి యత్నించారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు.

ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయ సంఘాల నేతలు దుండగులను అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారం తో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగటం అప్రజాస్వామికం అన్నారాయన. ప్రతాప్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
చదవండి: టీడీపీ స్కెచ్‌.. ‘నీ పంట దున్నెయ్‌.. లీడర్‌ని చేస్తాం..’

మరిన్ని వార్తలు