టీడీపీ నేతల దాష్టీకం

18 Apr, 2022 04:04 IST|Sakshi

చంద్రగిరి/పుంగనూరు: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని టీడీపీ నేతలు బరితెగించిన రెండు వేర్వేరు ఘటనలివి. స్వయానా మేనకోడళ్లయిన చెల్లెలి కుమార్తెలు ఇల్లు కట్టుకుంటున్నారన్న కారణంతో ఓ మేనమామ వారిని నానా దుర్భాషలాడిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరగ్గా.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాల్టీలో జరిగింది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలివీ..

ఇల్లు కట్టుకుంటున్నందుకు..
చంద్రగిరిలో చాకలి వీధికి చెందిన మాలినికి ఆమె తల్లి అమినాబి ద్వారా 2007లో పసుపు–కుంకుమ కింద కొంత స్థలం వచ్చింది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంతకాలం ఇంటి నిర్మాణం చేపట్టలేదు. కానీ, 15 రోజుల క్రితం ఆమె కుమార్తెలు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దీంతో వారి మేనమామ అయిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా.. కన్నా, చోటులతో కలిసి ఆదివారం ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నారంటూ మాలిని కుమార్తెలు ప్రశ్నించగా గౌస్‌బాషా వారిని నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడాడు. వీరిద్దరిలో ఒకరు నిండు గర్భిణీ అయిన సుల్తానా బేగంపై దాడికి యత్నించగా సొంత చెల్లెలు అయిన మాలినీతో కూడా గౌస్‌బాషా అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అతనితోపాటు కన్నా, చోటులపై చర్యలు తీసుకోవాలని మాలిని కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వీరి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం 
మరో ఘటనలో.. పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ మనోహర్‌ తన స్వగ్రామమైన కుమ్మరగుంటకు ఆదివారం వెళ్లారు. అక్కడ మాజీ సర్పంచ్‌ శంకరప్ప, గ్రామస్తులతో కలసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించుకుంటుండగా పుంగనూరు, వనమలదిన్నె, మేకంజామనపల్లెకు చెందిన టీడీపీ నేతలు చిన్నమోహన్‌నాయుడు, ప్రేమకుమార్‌ నాయుడు, ప్రసాద్‌ నాయుడు, మాధవరెడ్డి, సీవీ రెడ్డి, బుల్లెట్‌ పవన్, శ్రీకాంత్, పోలీస్‌ గిరి, రాజేంద్ర, సత్య వాహనాల్లో కుమ్మరగుంటకు వచ్చి మనోహర్‌ను నానా దుర్భాషలాడుతూ ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తూ కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు.

గ్రామస్తులు 108కు సమాచారం అందించి తీవ్రంగా గాయపడ్డ మనోహర్‌ను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోహర్‌కు ఛాతిపైన, కాళ్లపైన తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మనోహర్‌ను ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం తదితరులు పరామర్శించారు.  

మరిన్ని వార్తలు