పోలీసులకు చిక్కిన హుండీల దొంగ

3 Jun, 2022 08:38 IST|Sakshi

అచ్యుతాపురం(అనకాపల్లి): చిన్న చిన్న ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అచ్యుతాపురం పోలీసులకు గురువారం చిక్కాడు. ఎస్‌ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా సంచరిస్తున్న అప్పలరాజును పోలీసులు విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. విశాఖ జ్ఞానపురానికి చెందిన అప్పలరాజుపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 5న అచ్యుతాపురం మండలంలోని ఉప్పవరం ఆంజనేయస్వామి ఆలయంలో రూ.9వేలు, ఫిబ్రవరి 23న మునగపాక మండలం టి.సిరసపల్లి వీరభద్రస్వామి ఆలయంలో రూ.6వేలు, మే 21న పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేలు, మే 25న సబ్బవరం మండలం జోడుగుళ్లు ప్రాంతంలో బంగారమ్మతల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు విచారణలో రాబట్టారు. అప్పలరాజు రాత్రి వేళల్లో మద్యం సేవించి చిన్న ఆలయాల్లో హుండీలు లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇతనిపై విశాఖనగరంలో 20 కేసులు ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

నాపై తప్పుడు కేసు... విచారణ చేయండి’
మాకవరపాలెం : తనపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కొత్తపాలెం గ్రామానికి చెందిన యాకా లోవరాజు పోలీసులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశాడు. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ లోవరాజుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం లోవరాజు విలేకరులతో మాట్లాడాడు. తహసీల్దార్‌ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని తెలిపాడు.  నిర్వాసిత కాలనీలో పట్టా కోసం అధికారులను కోరగా అప్పట్లో పనిచేసిన వీఆర్వో రూ.80వేలు అవుతుందని చెప్పడంతో మొదట రూ.10 వేలు ఇచ్చానన్నాడు.

అనంతరం రూ.70వేలు సిద్ధం చేసుకోవాలని చెప్పగా నగదు పట్టుకుని వెళ్లానన్నాడు. వీఆర్వో తహసీల్దార్‌ ఇంటికి తీసుకెళ్లి నగదు తీసుకుని పట్టా ఇచ్చినట్టు తెలిపాడు. తీరా ఇప్పుడు ఈ పట్టా నకిలీదని, తానే సృష్టించానని తహసీల్దార్‌ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్‌ రాణీ అమ్మాజీని వివరణ కోరగా నగదు తీసుకున్నట్టు చెబుతున్న వీఆర్వో కన్నయ్య మరణించాడని, పట్టా తాను ఇవ్వలేదన్నారు. అది నకిలీ పట్టా కావడంతోనే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినట్టు తెలిపారు. 

(చదవండి: హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్‌)

మరిన్ని వార్తలు