తప్పతాగి.. తప్పుడు మార్గంలో..

13 Jun, 2022 00:54 IST|Sakshi

లారీ నడిపి కారును ఢీకొట్టిన డ్రైవర్‌

రాజీవ్‌ రహదారిపై ముగ్గురు మృత్యువాత

చిన్నకోడూరు (సిద్దిపేట): తప్పతాగిన డ్రైవర్‌ విచక్షణ కోల్పోయి తప్పుడు మార్గంలో లారీని నడిపి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద రాజీవ్‌ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ తాండ్ర పాపారావు(64), భార్య పద్మ (58)తో కలసి కరీంనగర్‌లో నివాసముం టున్నారు.

అమెరికాలో ఉంటున్న వీరి కుమా రుడు ప్రీతమ్‌రావు, కోడలు అనూష వద్దకు వచ్చే నెలలో వెళ్లాల్సి ఉండటంతో షాపింగ్‌ చేయడానికని అద్దెకారులో హైదరాబాద్‌ బయ లుదేరారు. మల్లారం వద్దకు రాగానే రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ వీరి కారును ఢీ కొట్టింది. దీంతో పాపారావు, పద్మ, కారు డ్రైవర్‌ గొంటి ఆంజనేయులు(48) అక్కడికక్కడే మృతి చెందారు.

లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్‌ఐ శివానందం, సిద్దిపేట రూరల్‌ సీఐ జానకిరాంరెడ్డి, నంగనూరు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి కారులో ఇరుక్కుపోయిన వారిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గురైన వాహనాలను జేసీబీతో తొలగించి ట్రాఫిక్‌ను సరిచేశారు. 

40 రోజుల క్రితం తండ్రి మృతి
పాపారావు తండ్రి సూర్యారావు 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణం నుంచి కోలుకుంటున్న సమయంలోనే పాపారావు దంపతులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆస్పత్రి వద్ద పాపారావు సోదరులు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. పాపారావు సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 

కుటుంబ పెద్దను కోల్పోయారు...
కారు డ్రైవర్‌ గొంటి ఆంజనేయులు స్వస్థలం కరీంనగర్‌ జిల్లా బావుపేట మండలం నాగుల మల్యాల. అతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆంజనేయులు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

మరిన్ని వార్తలు