విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై..

22 Jun, 2021 18:05 IST|Sakshi

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

తల్లడిల్లిన తల్లులు

ఈదరలో విషాద ఛాయలు  

అప్పటివరకూ బుడిబుడి అడుగులతో కళకళలాడిన ఆ ఇళ్లు బోసిపోయాయి. ముద్దులొలికే చిన్ని నవ్వులు ‘అదృశ్య’మయ్యాయి. ఏమైందో అర్థంకాని తల్లి మనసులు తల్లడిల్లాయి. కూలీనాలీ చేసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు చెంగుచెంగున గెంతుతూ అమ్మా అంటూ ఒడి చేరతారని ఆశపడ్డాయి.. భర్తలు దూరంగా ఉంటున్నా బిడ్డలే సర్వస్వంగా భావించి బతుకులీడుస్తున్న ఆ మాతృమూర్తుల గుండెలను అంతలోనే పిడుగులాంటి వార్త పిండేసింది. కన్నీరుమున్నీరు చేసింది. ముగ్గురు పిల్లల దుర్మరణంతో ఈదర గ్రామం గుండె చెరువయ్యేలా రోధించింది. శోకసముద్రంలో మునిగిపోయింది.   

ఈదర(ఆగిరిపల్లి): ఈదరకు చెందిన కగ్గా జ్యోతి భర్తతో విడిపోయింది. రెండేళ్లుగా తన ఇద్దరు ఆడపిల్లలు శశిక(11), చంద్రిక(9)లే ప్రాణంగా జీవిస్తోంది. కూలీనాలీ చేసుకుని వారిని పెంచుకుంటోంది. సోమవారం జ్యోతి కూలి పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో జ్యోతి పని చేసే మేస్త్రీకి ఆమె అక్క ఫోన్‌ చేసి పిల్లలు కనబడటం లేదని చెప్పింది. దీంతో పని నుంచి ఇంటికి వచ్చిన ఆమె పిల్లల కోసం ఊరంతా వెతికింది. వీరితోపాటు సమీప బంధువు గండికోట పంగిడమ్మ కుమారుడు జగదీష్‌ (8) కూడా కనిపించలేదు. దీంతో బంధువుల సాయంతో పిల్లల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో జ్యోతి ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు నూజీవీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఆరు బృందాలుగా ఏర్పడి హనుమాన్‌ జంక్షన్‌ సీఐ కె.సతీశ్‌ ఆగిరిపల్లి ఎస్‌ఐ చంటిబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం శోభనాపురం అల్లూరమ్మ చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఓ రైతు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పిల్లల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆడుకుంటూనే వెళ్లి..  
శశిక, చంద్రిక, జగదీష్‌ ముగ్గురూ జ్యోతి ఇంటి ముందు సోమవారం మధ్యాహ్నం ఆడుకున్నారు. ఈదర గ్రామం నుంచి బొద్దనపల్లి ఆర్సీఎం చర్చి మీదుగా వారు ఆడుకుంటూ వెళ్లడాన్ని కొందరు గ్రామస్తులు చూశారు. ఆ తర్వాత వీరు శోభనాపురం అల్లూరమ్మ చెరువు వైపు వెళ్లి స్నానం చేసేందుకు చెరువులోకి దిగి మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చెరువులో ముందుగా శశిక, చంద్రిక మృతదేహాలు లభ్యం కాగా, మరి కొంత దూరంలో జగదీష్‌ మృతదేహం లభ్యమైంది. ప్రమాద స్థలాన్ని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్‌ సీఐ కె.సతీశ్‌, తహసీల్దార్‌ వీవీ భరత్‌రెడ్డి పరిశీలించారు.

ఆ తల్లులకు పిల్లలే సర్వస్వం
శశిక, చంద్రిక తల్లిదండ్రులు, గండికోట జగదీష్‌ తల్లిదండ్రులు విడిపోవడంతో ముగ్గురు పిల్లలు వారి తల్లుల వద్దే ఉంటున్నారు. ముగ్గురూ బొద్దనపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లులిద్దరూ బిడ్డలనే సర్వస్వంగా భావిస్తున్నారు. కూలి పనులు చేసుకుని వారిని చదివించుకుంటున్నారు. పిల్లల మృతితో గుండెలవిసేలా రోధిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావట్లేదు.

చదవండి: కోడలిని వేధించిన పాపం..!

మరిన్ని వార్తలు