‘కండలేరు’లో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం 

14 Apr, 2022 04:42 IST|Sakshi

కొలపనాయుడుపల్లిలో విషాదం 

జలాశయంలో స్నానాలపై నిషేధం 

పొదలకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : కండలేరు జలాశయంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలను పోలీసు అధికారులు జాలర్ల సాయంతో బుధవారం వెలికితీశారు. పొదలకూరు సీఐ జి.సంగమేశ్వరరావు పర్యవేక్షణలో కండలేరు ఎస్‌ఐ అనూషా ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను వెలికి తీయించారు.

తమిళనాడుకు చెందిన పొన్నుకుమార్, బోసు కుటుంబాలకు చెందిన మొత్తం 8 మంది శ్రీరామనవమి పూర్తయిన సందర్భంగా కండలేరును తిలకించి స్నానాలు చేసేందుకు జలాశయం వద్దకు వెళ్లారు. అయితే జలాశయం లోతు, వివరాలు తెలియని వారు రివిట్మెంట్‌కు పట్టిన పాచి వల్ల జారిపోయి.. లోతుగా ఉన్న జలాశయంలో పడిపోయారు. బోసును అతడి భార్య చీర కొంగు అందించి ప్రాణాలు కాపాడింది. పొన్నుకుమార్‌(36), అతడి కుమార్తె పవిత్ర (7), బోసు కుమార్తె లక్ష్మి(11)  గల్లంతయ్యారు. తమిళులైన వీరు చేజర్ల మండలం కొనపనాయుడుపల్లికి వలస వచ్చి  చుట్టుపక్కల గ్రామాలకు తినుబండారాలను ద్విచక్రవాహనంపై వెళ్లి వేస్తుంటారు.   

కండలేరులో స్నానాలు నిషేధం : డీఎస్పీ 
కండలేరు జలాశయంలో స్నానఘట్టాలు లేవని, స్నానాలు, ఈత నిషేధమని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డీఎస్పీ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

మరిన్ని వార్తలు